రౌడీల పెత్తనం సహించం

31 Aug, 2014 04:42 IST|Sakshi

గీసుకొండ : ‘ప్రజలు ఎందుకో గుడ్డిగా ఒక్కోసారి రౌడీల వెంట ఉరుకుతుంటరు.. ఎందుకో ఒక్కోసారి గుండాయిజం చేసేవారి వెంట తిరుగుతుంటరు.. వారినే ఎన్నుకుంటారు.. గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ చేసే వారు కూడా పిచ్చిగా ఆలోచన లేకుండా వారి వెంట తిరుగుతుంటరు.. ఇది ప్రజాస్వామ్యం.. ప్రజలను కొట్టడానికి, దోచుకోవడానికి కాదు ఎన్నికైంది. ప్రజలకు సేవ చేయడానికి. ఎవరో ఒకరిద్దరు రౌడీలను గ్రామాల్లో తయారు చేసుకుని పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదు.

రాష్ట్రంలో ఇలాంటి వాళ్లను కనిపెట్టుకుని ఉండాలని మా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. అలాంటివారిని వదిలి పెట్టేది లేదు’ అంటూ వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి  విరుచుకుపడ్డారు. గీసుకొండ మండలంలోని బాలయ్యపల్లె డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు రెండో దశ పనులకు శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అప్పటి వరకు తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృత జ్ఞతలు అని, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలిందని అని మాట్లాడిన ఆయన ఒక్కసారిగా టాపిక్ మార్చారు.

‘ విచిత్రం ఏమిటేంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వందల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఎట్లా వస్తాయి?. నా ఇల్లు హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంది. పదేళ్లు మంత్రిగా పని చేసిన. నా దగ్గరకు వచ్చే సర్పంచ్‌లు అయ్యో సారూ మీ ఇల్లు గిట్లున్నదేంది అని అంటాంటె వారు నన్ను పొగుడుతాండ్లో.. అవమానపరుస్తాండ్లో తెల్వడం లేదు. మీ ఇంటికన్నా గా వీఆర్‌వో ఇల్లు బాగున్నదని అంటరు’ అని చెప్పుకొచ్చారు.

రౌడీయిజంపై ఎంపీ ఘాటుగా మాట్లాడుతుండగా సభికులు స్పందించి చప్పట్లు కొట్టారు. ఆయన పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముసిముసి నవ్వులు నవ్వారు. అయితే అంతకు ముందు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గతంలోని ప్రజాప్రతినిధులు  పదేళ్లుగా నియోజకవర్గానికి ఒక్క మంత్రిని, ఎంపీని రానివ్వలేదని, దీనికి రౌడీ రాజకీయాలే కారణమంటూ విరుచుకుపడ్డారు.
 

మరిన్ని వార్తలు