కిరణ్‌ మరణం

26 Jun, 2020 06:11 IST|Sakshi

జూపార్కులో రాయల్‌బెంగాల్‌ టైగర్‌ మృతి

బహదూర్‌పురా: రాయల్‌ బెంగాల్‌ వైట్‌ టైగర్‌ (కిరణ్‌– 8) కుడివైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూయో ప్లాస్టిక్‌ కణితితో బాధపడుతూ గురువారం మృతి చెందింది. నెహ్రూ జూలాజికల్‌ పార్కు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కులో పుట్టి పెరిగిన కిరణ్‌ (టైగర్‌) కొంతకాలంగా న్యూయో ప్లాస్టిక్‌ ట్యూమర్‌తో బాధపడుతోంది. దీనికి కొన్నిరోజులుగా ల్యాంకోన్స్‌ శాస్త్రవేత్తలు, వైద్యులు, జూపార్కు వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. గత నెల 29న టైగర్‌కు డాక్టర్‌ నవీన్, వీబీఆర్‌ఐ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

మృతి చెందిన వైట్‌ టైగర్‌కు వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. కిరణ్‌ తండ్రి బద్రి కూడా న్యూయో ప్లాస్టిక్‌ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిరణ్‌ (టైగర్‌) తాత రుద్ర (టైగర్‌) 12 ఏళ్ల వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది. కిరణ్‌ కూడా న్యూయో ప్లాస్టిక్‌ వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించారు. జూపార్కుకే వన్నె తెచ్చే రాయల్‌ బెంగాల్‌ టైగర్లు ట్యూమర్‌ వ్యాధితో మృతిచెందుతుడటం ఆందోళనకు గురి చేస్తోంది. 

మరిన్ని వార్తలు