వెల్‌కమ్‌ సర్‌

17 Dec, 2019 11:01 IST|Sakshi

రాష్ట్రపతి దక్షిణాది విడిది.. ఆర్‌పీ నిలయం

ఈ నెల 20న రానున్న రామ్‌నాథ్‌ కోవింద్‌

ముస్తాబు ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాక కోసం బొల్లారంలోని దక్షిణాది విడిది ముస్తాబవుతోంది. ఈ నెల 20న బొల్లారంలోని రాష్ట్రపతి ఇక్కడికివిచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పూర్తిస్థాయి కార్యకలాపాలు సైతంఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. బొల్లారంలోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌ను ఆనుకుని ఉండే రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతనుకట్టుదిట్టం చేశారు. పీడబ్ల్యూడీ డిపార్ట్‌మెంట్‌తో పాటు కంటోన్మెంట్‌బోర్డు ఆధ్వర్యంలోని రెండు శానిటరీ ప్రత్యేక బృందాలు రాష్ట్రపతినిలయంలో ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.

కంటోన్మెంట్‌: భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు మరో రెండు అధికారిక నివాసాల్లో ఒకటి సీమ్లాలోని ‘ది రిట్రీట్‌ బిల్డింగ్‌’ కాగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని ‘రాష్ట్రపతి నిలయం’ మూడోదిæ. ఈ భవనం నిజాం నజీర్‌ ఉద్‌– దౌలా హయాంలో 1860లో నిర్మితమైంది. బొల్లారంలోని 97 ఎకరాల సువిశాల స్థలంలో 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన భవనం ఉంది. కంటోన్మెంట్‌ పరిధిలోని చీఫ్‌ మిలిటరీ ఆఫీసర్‌ నివాస స్థలంగా వినియోగించే ఈ భవనాన్ని రెసిడెన్సీ హౌస్‌గా వ్యవహరించేవారు. 1948లో హైదరాబాద్‌ సంస్థానం విలీనం అనంతరం రాష్ట్రపతి దక్షిణాది తాత్కాలిక నివాసంగా మారింది. నాటి నుంచి భారత రాష్ట్రపతి కనీసం ఏడాదికోసారి కొన్నిరోజుల పాటు ఇక్కడే విడిది చేస్తారు. ఇక్కడి నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రపతి భవన్‌ నిర్వహణ బాధ్యతల్ని సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు నిర్వర్తిస్తున్నాయి. 

20 గదులు, సొరంగమార్గం..
రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనం ప్రెసిడెంట్స్‌ వింగ్, ఫ్యామిలీ వింగ్‌తో పాటు ఏడీసీ వింగ్‌ పేరిట మూడు విభాగాలుగా ఉంటుంది. ఇందులో డైనింగ్‌ హాల్, దర్బార్‌ హాల్, మార్నింగ్‌ రూమ్, సినిమా హాల్‌ సహా మొత్తం 11 గదులుంటాయి. ప్రధాన భవనానికి కొంత దూరంలో ఉండే కిచెన్‌ ద్వారా ఆహారాన్ని డైనింగ్‌ హాల్‌కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక సొరంగ మార్గం ఉంది. రాష్ట్రపతి ప్రధాన నివాస భవనంతో పాటు మరో 150 మంది వరకు సిబ్బంది ఉండేందుకు ప్రత్యేక వసతి సముదాయం ఉంది. 

పూలు, పండ్లతోటలు..
వివిధ రకాల పూల మొక్కలతో పాటు సపోటా, మామిడి, దానిమ్మ, జామ, కొబ్బరి, ఉసిరి వంటి తోటలున్నాయి. దీంతో పాటు 116 రకాల సుగంధ, ఔషధ మొక్కలతో కూడిన ప్రత్యేక హెర్బల్‌ గార్డెన్‌ ఈ ఆవరణలో ఉంది. రెండు మంచినీటి బావులు కూడా ఉన్న రాష్ట్రపతి భవన్‌ ఆవరణ ఓ చిన్నపాటి అరణ్యాన్ని తలపిస్తుంది. ప్రతిభా పాటిల్‌ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఈ నిలయంలోని ఖాళీ ప్రదేశంలో వివిధ రకాల ఔషధ మొక్కలతో పాటు పచ్చదనం పరుచుకునేలా పూలు, పండ్ల తోటలను విస్తరించారు. 2015లో రాష్ట్రపతి నిలయంలో అప్పటి రాష్ట్రపతి నక్షత్ర వాటికను ప్రారంభించారు. 27 నక్షత్రాలకు (రాశులు) సూచికలుగా 27 విభిన్న రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి సందర్శన ముగిశాక సాధారణ ప్రజల సందర్శనకు కొన్ని రోజుల పాటు అనుమతిస్తారు. 

పక్షుల కిలకిలారావాలు..  
పచ్చని చెట్లు పూమొక్కలు, పండ్ల తోటలతో చిట్టడివిని తలపించే రాష్ట్రపతి నిలయంలో పక్షుల కిలకిలారావాలు, మయూరాల సందడి చేస్తాయి. ఇక్కడ కోతులు, పాముల బెడద కూడా ఉంది. ప్రతి ఉదయం, సాయంత్రం వేళల్లో రాష్ట్రపతి వాకింగ్‌ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కోతులు పాములు కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉంటారు. గతేడాది రాష్ట్రపతి నిలయంలో నాలుగు పాములను పట్టుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు