రూ.లక్ష కోట్ల ఐటీ ఎగుమతులు మా లక్ష్యం: కేటీఆర్

26 Feb, 2015 02:05 IST|Sakshi
రూ.లక్ష కోట్ల ఐటీ ఎగుమతులు మా లక్ష్యం: కేటీఆర్

* నిపుణుల సంఖ్య 10 లక్షలకు పెంచే ప్రయత్నం
* ఐటీ, ఎలక్ట్రానిక్స్ వర్గాలు పెట్టుబడులు, పరిశోధనలకు ముందుకు రావాలని పిలుపు

 
 సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఐటీకి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని మారుస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బహుళజాతీయ కంపెనీలకు, ఐటీ పరిశ్రమకు అవసరమైన అత్యుత్తమ విద్యా, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నైపుణ్యం కలిగిన విద్యార్థులు అందుబాటులో ఉన్నారన్నారు. బెంగళూరులో బుధవారం జరిగిన తెలంగాణ ఐటీ రోడ్ షో కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమ వర్గాలతో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేం దుకు, పరిశోధనలు చేపట్టేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక వర్గాలు ముందుకు రావాలని కోరారు.
 
  ఐటీ రంగంలో లక్ష కోట్ల ఎగుమతులే  ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 3.25 లక్షల ఉద్యోగుల సంఖ్యను 10 లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక్కడి నుంచి బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని వెల్లడిం చారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్, డెల్, మొటోరోలా, డెలాయిట్, కన్వర్జీస్, యూబీఎస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ, హనీవెల్, సీమెన్స్, జేపీ మోర్గాన్,  యునెటైడ్ హెల్త్ గ్రూపు, ఫేస్ బుక్ తదితర 500 వరకు కంపెనీలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటన్నారు. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, ఐగేట్, సొనాట, ఇన్ఫోటెక్ తదితర సంస్థలు  హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. అత్యుత్తమ విద్యా, పరిశోధన రంగాల్లో  ఐఎస్‌బీ, జేఎన్‌టీయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, డీఆర్‌డీఓ సంస్థలు విద్యార్థులకు సేవలందిస్తున్నాయన్నారు. ఇతర నగరాల తో పోల్చితే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలపై వెచ్చించాల్సిన ఖర్చు తక్కువన్నారు.
 
 నిజాం కాలం నుంచే అంతర్జాతీయ గుర్తింపు ఉన్న హైదరాబాద్‌ని ఇన్నోవేషన్, టెక్నాలజీ, డెవలపింగ్ న్యూ గ్రోత్ సెక్టార్ త్రూ స్మార్ట్ సిటీ ప్లానింగ్ ద్వారా విస్తరిస్తామన్నారు. అందుబాటులోకి రానున్న మెట్రో రైలు, అత్యాధునిక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం, ఉచిత వైఫై సేవలు తదితరాలన్నింటిని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ఆర్థిక అభివృద్ధికి ఐటీ రంగం ఇంజన్‌గా ప్రభుత్వం గుర్తిస్తోందని, దీని అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఐటీ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్, రహేజా గ్రూపు చైర్మన్ నీల్ రహేజా తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు