మత్స్య అభివృద్ధికి రూ.1,000 కోట్లు

17 May, 2018 05:24 IST|Sakshi

మంజూరు చేసిన ఎన్‌సీడీసీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏడాది పొడవునా అన్ని ప్రాంతాల్లో చేపలు లభ్యమయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి (ఐఎఫ్‌డీఎస్‌) రూపకల్పన చేసింది. ఈ పథకం అమలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపల ఉత్పత్తిని పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, అవసరమైన మౌలిక సదుపాయా లను ఏర్పాటు చేస్తారు. ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు, మహిళా మత్స్య సహకార సంఘాలు, మత్స్య మార్కెటింగ్‌ సంఘాలు, జిల్లా మత్స్య సహకార సంఘాలు, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య సభ్యులు లబ్ధిపొందుతారు. రొయ్యలు, చెరువుల్లో, పంజరాల్లో చేపల సాగు వంటి విభిన్న పద్ధతుల ద్వారా చేపల పెంపకం   చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద లబ్ధిదారులకు అనేక రకాల పరికరాలు అందజేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. వాటిలో లబ్ధిదారులకు 75 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీ లభిస్తుంది. చేపలు అమ్ముకునేందుకు 50 వేల ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం అందించనుంది. వాటిని 75 శాతం రాయితీపై ఇవ్వనుంది.

మరిన్ని వార్తలు