కల్యాణ కానుకకు రూ.1,000 కోట్లు

8 Feb, 2018 02:53 IST|Sakshi

ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచే యోచనలో సర్కారు

ఈబీసీలకూ పథకం వర్తింపు!  

సాక్షి, హైదరాబాద్‌: పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో తలపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించనుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.75వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తాజాగా ఈ సాయాన్ని ఏకంగా రూ.లక్షకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా 2018–19 వార్షిక సంవత్సరంలో బడ్జెట్‌ కింద ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించబోతోంది.

ఈ మేరకు పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దరఖాస్తులు, పంపిణీ తదితర వివరాలను సమర్పించాలని సంక్షేమ శాఖలకు ప్రభుత్వంఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శాఖల వారీగా లబ్ధిదారులు, పంపిణీ చేసిన సాయం వివరాలను అధికారులు సమర్పించారు. ఈ రెండు పథకాల కింద ఇప్పటివరకు 3.25 లక్షల దరఖాస్తులు రాగా... వీటిలో 3లక్షల మందికి ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు.  2018–19 వార్షిక సంవత్సరానికి లక్ష దరఖాస్తులు రావొచ్చని అంచనా.

ఈ నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు వార్షిక బడ్జెట్‌ కింద రూ.వెయ్యి కోట్లకు సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాయి. కల్యాణలక్ష్మి పథకాన్ని ఈబీసీ(ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు)లకూ వర్తింపచేయాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు