పాలమూరు ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణం 

6 Aug, 2019 03:03 IST|Sakshi

దేవాదుల, సీతారామ, ఎఫ్‌ఎఫ్‌సీకి మరో రూ.2,638 కోట్లు 

కాళేశ్వరం ప్యాకేజీ–12 పనుల పూర్తికి రూ.1,500 కోట్లు 

వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు 

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రధాన అడ్డంకులను దాటుతూనే, సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచేలా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్‌ పనుల పూర్తికి వీలుగా ఈ రుణాలు తీసుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నిజానికి పాలమూరు–రంగారెడ్డి పనులను రూ.32,500 కోట్లతో చేపట్టగా ఇందులో ఇప్పటివరకు 20 శాతం పనులే పూర్తయ్యాయి. నిధుల కొరత కారణంగా ఏడాదిగా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇది వరదజలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్‌ పనులకు కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకోవాలని సర్కారు గతంలో నిర్ణయించింది. ఈ పనులకు రూ.17 వేల కోట్లు అవసరం ఉండగా రూ.10 వేల కోట్లు రుణాలిచ్చేందుకు పీఎఫ్‌సీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రుణం తీసుకునేలా ఉత్తర్వులు వెలువడగా, త్వరలోనే దీనికి సంబంధించి పీఎఫ్‌సీతో ఒప్పందాలు జరగనున్నాయి.  

రూ.41,500 కోట్లకు కాళేశ్వరం రుణాలు! 
దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ) ప్రాజెక్టుల కోసం ‘తెలంగాణ రాష్ట్ర వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(టీఎస్‌డబ్ల్యూఐసీ)’పేరుతో ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్‌ ద్వారా రూ.2,638 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే ఈ కార్పొరేషన్‌కు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం రూ.17 వేల కోట్ల మేర రుణం ఇచ్చింది. వీటిల్లో ఎక్కువగా సీతారామ, దేవాదుల పనులకే నిధులు వెచ్చించనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ– 12 పనుల పూర్తికి రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) నుంచి రూ.1,500 కోట్లు రుణం తీసుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారానే ఇప్పటివరకు వివిధ రుణ సంస్థల నుంచి రూ.40 వేల కోట్లకుపైగా సేకరించగా, అందులోంచే ప్రాజెక్టు నిర్మాణపనులకు రూ.32 వేలకోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుత కాళేశ్వరం రుణాలు రూ.41,500 కోట్లకు చేరనున్నాయి. 

మరిన్ని వార్తలు