ఇక ‘కల్యాణలక్ష్మి’కి రూ.1,00,116 

20 Mar, 2018 01:01 IST|Sakshi

     శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన 

     షాదీ ముబారక్‌కి కూడా వర్తింపు.. 

     బాల్య వివాహాలకూ అడ్డుకట్ట పడుతోంది 

     ఇది పథకం సాధించిన సామాజిక విజయం 

     ఇప్పటివరకు 3.60 లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కల్యాణలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.75,116గా ఉన్న మొత్తాన్ని రూ.1,00,116కు పెంచుతున్నట్టు ప్రకటించింది. సోమవారం ఈ మేరకు శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పేరిట అందజేస్తున్న సాయాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

వారి ఆశీర్వాదమే కొండంత అండ 
‘అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించి మరో శుభవార్తను ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. కల్యాణలక్ష్మి/ షాదీముబారక్‌ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని రూ.లక్షా నూట పదహార్లకు పెంచుతున్నట్టు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచే కాకుండా.. సమాజహితం కోరే వారందరి నుంచి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నా. వారి ఆశీర్వాదమే కొండంత అండగా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సవినయంగా తెలియజేస్తున్నా’అని సీఎం పేర్కొన్నారు. ఇంటి మహాలక్ష్మిగా గౌరవించే ఆడపిల్లని.. గుండెల మీద కుంపటిగా భావించే మానసిక స్థితికి నిరుపేదలు మారుతున్నారని, కడుపులో ఉండగానే భ్రూణహత్యలకు పాల్పడుతున్న అమానుష సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని సభ దృష్టికి తెచ్చారు. ‘కొన్ని ఇళ్లల్లో ఆడపిల్లలు పెళ్లి లేకుండానే ఉండిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కల్యాణలక్ష్మి పేరుతో పథకాన్ని ప్రారంభించాం. ఆడపిల్లల కన్నీరు తుడుస్తున్న ఈ పథకం వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది’అని వివరించారు.

ఇప్పటిదాకా 3.60 లక్షల మందికి లబ్ధి 
‘తొలుత కల్యాణలక్ష్మి పేరుతో ఎస్సీ, ఎస్టీలకు, షాదీముబారక్‌ పేరుతో మైనారిటీ వర్గాలకు రూ.51 వేలు అందించటం ప్రారంభించాం. ప్రజల అభ్యర్థన మేరకు సామాజిక వర్గంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపజేశాం. గతేడాది ఈ మొత్తాన్ని రూ.75,116 పెంచాం. ఇప్పటి వరకు 3.60 లక్షల మందికి లబ్ధి చేకూరింది’అని సీఎం తెలిపారు. ఈ పథకం ఇతర సామాజిక ప్రయోజనాలను కూడా సాధించిందని, లబ్ధి పొందేవారి అర్హత వయసు 18 ఏళ్లుగా నిర్ణయించినందున ఈ ప్రయోజనం పొందేందుకు ఆడపిల్లకు ఆ వయసు వచ్చే వరకు పెళ్లిచేయకుండా ఆపుతున్నారని కేసీఆర్‌ తెలిపారు. ఫలితంగా బాల్య వివాహాల నిరోధానికి దోహదపడుతోందని వెల్లడించారు. ఈ పథకం కింద జరిగే వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు చట్టబద్ధత లభిస్తోందని, ఇది పథకం సాధించిన మరో ప్రయోజనమన్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయగానే సభలోని అధికార పక్ష సభ్యులు పెద్దపెట్టున బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు