ఇప్పటికీ అదే బెరుకు 

23 May, 2020 05:24 IST|Sakshi

ఇంకా ఖాళీగానే బస్సుల పరుగు

తొలిరోజుకంటే పరిస్థితి మెరుగు

రూ. 2 కోట్లకు చేరుకున్న ఆదాయం  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులంటే జనంలో ఇంకా భయం పోయినట్టు కనిపించటం లేదు. బస్సులు ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ అవి ఖాళీగానే పరుగుపెడుతున్నాయి. అయితే తొలిరోజుతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడిందని మాత్రం స్పష్టమవుతోంది. మంగళవారం నుంచి టీఎస్‌ ఆర్టీసీ బస్సులు ప్రారంభమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ సిటీ సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు మినహా మిగతా బస్సులన్నిం టికీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి రోజు రూ.65 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. ఆ రోజు ప్రయాణికుల స్పందన చాలా తక్కువగా ఉండటంతో అధికారులు కూడా కొన్ని బస్సులే తిప్పారు. దీంతో మొదటిరోజు 5 లక్షల కిలోమీటర్ల మేర మాత్రమే బస్సులు తిరిగాయి. (బస్సెక్కేందుకు భయపడ్డరు)

రెండో రోజు కొంత పరిస్థితి మెరుగుపడి రూ.1.65 కోట్ల ఆదాయం వచ్చింది. గురువారం రూ.2 కోట్ల ఆదాయం సమకూరింది. బస్సులు 12 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. దాదాపు 3,500 బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు మరో 2 వేలకు పైగా బస్సులు డిపోల్లోనే ఉంటున్నాయి. శుక్రవారం ఆక్యుపెన్సీ రేషియో కొంత పెరిగినా.. అమావాస్య ప్రభావం ఉంటుందని, కొంతమంది సెంటిమెంట్‌గా ప్రయాణించనందున ఎక్కువ స్పందనను ఆశించలేమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. శనివారం ఆదాయం, వాస్తవ ఆక్యుపెన్సీ రేషియో వివరాలను అధికారులు శనివారం లెక్క తేలుస్తారు. ఇక ఆదివారం సెలవు రోజు ఉన్నందున శనివారం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య మెరుగ్గా కనిపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. (బతుకు బండి కదిలింది)

మరిన్ని వార్తలు