డబ్బుల లెక్క ‘తేలింది’ 

11 May, 2019 02:28 IST|Sakshi

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో దొరికిన డబ్బు రూ.234 కోట్లు 

శాసనసభ ఎన్నికల్లో రూ.140 కోట్లు  

పార్లమెంటు ఎన్నికల్లో సుమారు రూ.94 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో పట్టుబడిన డబ్బు లెక్క తేలింది. ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అడ్డగోలుగా డబ్బును వెదజల్లాయి. సగటున ఒక్కో ఓటుకు రూ.2–3 వేల వరకు పంపిణీ చేశాయి. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గంలో సగటున రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని ఓ అనధికారిక అంచనా. మరి అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు, నగదు తరలింపులో ఆంక్షలు విధించి అడుగడుగునా చెక్‌పోస్టులు, తనిఖీలతో హోరెత్తించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) బృందాల దాడుల్లో దొరికిన మొత్తం ఎంతో తెలుసా! కేవలం రూ.234.39 కోట్లు.

ఇందులో అసెంబ్లీ ఎన్నికల్లోనే రూ.140.24 కోట్ల నగదు దొరికింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీమొత్తంలో డబ్బు పట్టుబడడం గమనార్హం. ఫ్లయింగ్‌ స్క్వాడ్, ఎస్‌ఎస్‌టీ, పోలీసు నిఘా బృందాల దాడుల్లో పట్టుబడ్డ సొమ్ములో లెక్కలు పక్కాగా చూపిన రూ.50.86 కోట్లను తిరిగి వెనక్కి ఇచ్చేశారు. రూ.20.73 కోట్ల నగదు ఇంకా పోలీసుల అధీనంలోనే ఉంది. ఈ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్‌ చేయాల్సి వుంది. కాగా, అక్రమంగా నగదు తరలిస్తున్నట్లు తేలినవారిపై కేసు నమోదు చేసిన పోలీసులు రూ.19.03 కోట్లను కోర్టులో జమ చేశారు. లెక్కలు సరిగా చూపని రూ.41.46 కోట్లను ఆదాయపన్ను శాఖకు బదలాయించారు. సీజ్‌ చేసిన నగదులో రూ.8.16 కోట్ల మేర నగదును జిల్లా ట్రెజరీల్లో జమ చేశారు.  

పార్లమెంటు ఎన్నికల్లో తగ్గిన డబ్బు ప్రవాహం! 
శాసనసభ ఎన్నికలతో పోలిస్తే గత నెలలో జరిగిన పార్లమెంటు పోరులో నగదు ప్రవాహం తక్కువగానే కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు రావడంతో విపక్షాల్లో ఊపు తగ్గింది. శాసనసభ ఫలితాలే పునరావృతమవుతాయని ధీమాతో ఉన్న అధికారపార్టీ కూడా ఖర్చు జోలికి వెళ్లకపోవడంతో వ్యయం భారీగా తగ్గింది. దీంతో ఈ ఎన్నికల్లో సుమారు రూ.94 కోట్లు మాత్రమే పట్టుబడ్డాయి. ఇందులో పోలీసుల దాడుల్లో రూ.43 కోట్లు లభించగా.. ఐటీ అధికారుల సోదాల్లో రూ.50.66 కోట్లు దొరికాయి. నగదు లావాదేవీలపై పరిమితి విధించినప్పటికీ, హైదరాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేరిట డ్రా చేసి తరలిస్తూ పట్టుబడ్డ రూ.8 కోట్ల నగదును సరైన పత్రాలు చూపడంతో ఐటీ శాఖ తిరిగి వెనక్కి ఇచ్చేసింది. 

మరిన్ని వార్తలు