‘వజ్ర’కు యాప్‌ బుకింగ్‌పై రూ.25 రాయితీ

5 Aug, 2017 05:21 IST|Sakshi
‘వజ్ర’కు యాప్‌ బుకింగ్‌పై రూ.25 రాయితీ

ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు
సాక్షి, హైదరాబాద్‌: వజ్ర బస్సుల్లో ప్రయాణానికి మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్‌లు బుక్‌ చేసుకునే ప్రయాణికులకు రూ.25 రాయితీ లభించనుంది. తొలి నాలుగు బుకింగ్‌లకు ఇది వర్తిస్తుంది. నేటి నుంచే ఈ రాయితీ లభించనున్నట్లు ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు తెలిపారు. ఆర్టీసీలో నగదు రహిత సేవలను పెంపొందించేందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు పేర్కొ న్నారు.

నగరంలోని కూకట్‌పల్లి, మెహదీ పట్నం, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల్లోని కాలనీల నుంచి వరంగల్, నిజామాబాద్‌లకు వజ్ర మినీ ఏసీ బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. మేలో ప్రవేశపెట్టిన ఈ బస్సులు ఆశించిన స్థాయిలో ఆదరణకు నోచుకోకపోవడంతో ఇప్పటికే అనేక రకాల మినహాయింపులను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.

నగరంలోని 600 కాలనీలకు సదు పాయం లభించే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. తొలిసారి యాప్‌ బుకింగ్‌లను ప్రవేశ పెట్టినా ప్రయాణికులు ఆ సేవలను పెద్దగా వినియోగించుకోలేదు. దీంతో గ్రౌండ్‌ బుకింగ్‌ లకు అవకాశం కల్పించారు. తాజాగా యాప్‌ బుకింగ్‌లలో మొదటి నాలుగు ప్రయాణాలకు రూ.25 చొప్పున రాయితీని ప్రవేశపెట్టారు. త్వరలో డ్రైవర్‌ వద్దనే నగదు చెల్లించి టికెట్‌ తీసుకొనే పద్ధతిని అందుబాటులోకి తేనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు