కాలంతో పోటీగా కాళేశ్వరం

5 Feb, 2019 01:33 IST|Sakshi

9వ ప్యాకేజీ సెప్టెంబర్‌ కల్లా పూర్తి: కేటీఆర్‌ 

మల్కపేట రిజర్వాయర్‌ సందర్శన.. పనుల పరిశీలన

సాక్షి, సిరిసిల్ల: నాలుగేళ్ల బడ్జెట్‌లో ఏటా రూ.25 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసమే కేటాయించామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. కాలంతో పోటీగా కాళేశ్వరం ప్రాజెక్టు పరుగెడుతోందని, దీని వెనుక కేసీఆర్‌ దార్శనికత, నిపుణుల శ్రమ దాగి ఉందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు, ప్యాకేజీ – 9 పనులను సోమవారం ఆయన పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు మల్కపేట రిజర్వాయర్‌ వరకు టన్నెల్‌ నిర్మాణం, పంపుహౌస్, రిజర్వాయర్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల కళ్లలో ఆనందం చూడటం కోసమే ముఖ్యమంత్రి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు – 9వ ప్యాకేజీని సకాలంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదట 11 టీఎంసీల సామర్థ్యంగా ఉన్న ఈ ప్యాకేజీని ప్రస్తుతం 141 టీఎంసీ సామర్థ్యానికి పెంచామని చెప్పారు. అంతర్గత టన్నెల్‌ నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, కేవలం ఒక కి.మీ దూరం మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. మూడు టీఎంసీల సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్‌ 90 శాతం వరకు పూర్తయిందని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ నిర్మాణం మాత్రమే పెండిం గ్‌లో ఉందన్నారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌కు అవసరమైన భూ సేకరణను వీలైనంత త్వరగా చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ యాస్మిన్‌బాషాను కోరారు. ప్యాకేజీ – 9 పనులు వచ్చే సెప్టెంబర్‌ కల్లా దాదాపుగా పూర్తి కానున్నట్లు తెలిపారు.  

యుద్ధప్రాతిపదికన చేయండి 
తెలంగాణ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా భూ నిర్వాసితుడని చెప్పారు. ఎగువమానేరు ముంపులో భాగంగా సర్వం కోల్పోయినవారు కాబట్టి ఆయనకు నిర్వాసితుల బాధలన్నీ తెలుసని అన్నారు. న్యాయమైన పరిహారం చెల్లిస్తూనే, సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణలోని కోటీ 25 లక్షల ఎకరాలకు నీరందించాలని కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. మెట్ట ప్రాంతమైన సిరిసిల్లకు సెప్టెంబర్‌ వరకు రెండు పంటలకు నీరు అందబోతుందని అన్నారు.  

మరిన్ని వార్తలు