కమీషన్‌ కోసం రూ.28 కోట్ల ‘మార్పిడి’

13 Jan, 2017 05:00 IST|Sakshi
కమీషన్‌ కోసం రూ.28 కోట్ల ‘మార్పిడి’

‘ముసద్దీలాల్‌’తో కలసి నీల్‌సుందర్‌ దందా
డబ్బు డిపాజిట్‌ చేసి, తన ఖాతాలోకి డైవర్ట్‌
అరెస్టు చేసిన హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు


సాక్షి, హైదరాబాద్‌: నోట్ల రద్దు ప్రకటన వెలువడిన రోజు రూ.100 కోట్ల ‘వ్యాపారం’చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసద్దీలాల్‌ జ్యుయెలర్స్‌ కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు ముసద్దీలాల్‌ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో అయిన డిపాజిట్లు, మళ్లింపులపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్‌కు చెందిన అష్టలక్ష్మి గోల్డ్‌ బులియన్‌ నిర్వాహకుడు నీల్‌సుందర్‌ దందా వెలుగులోకి వచ్చింది. ఇతగాడు ముసద్దీ లాల్‌ యాజమాన్యంతో కలసి కుట్రపన్ని 30 శాతం కమీషన్‌కు రూ.28 కోట్ల పెద్దనోట్లు మార్పిడి చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో గురువారం నీల్‌సుందర్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాశ్‌ మహంతి ప్రకటించారు.

30 శాతం కమీషన్‌తో మార్పిడి..
నోట్ల రద్దు ప్రకటన తర్వాత కొందరు నల్లబాబులకు చెందిన రూ.28 కోట్లను బంగారం రూపంలో మార్చడానికి నీల్‌సుందర్‌ అంగీకరించాడని పోలీసులు చెప్తున్నారు. దీని నిమిత్తం 30 శాతం కమీషన్‌కు ఒప్పందం కుదుర్చుకున్న ఇతగాడు తన దందాకు సహకరిస్తే 10 శాతం చెల్లించేలా ముసద్దీలాల్‌ యాజమా న్యంతో ఒప్పందం చేసుకున్నాడు. డీమోనిటైజేషన్‌ ప్రకటన వెలువడిన నవంబర్‌ 8వ తేది రాత్రి ‘మూడు గంటల్లో వేల మంది కస్టమర్లకు బంగారం విక్రయించే’ప్రణాళికను సిద్ధం చేసుకున్న ముసద్దీలాల్‌ యాజమాన్యం నీల్‌సుందర్‌ ప్రతిపాదనలకు అంగీకరించింది.

దీంతో ఆ మరుసటి రోజు ముసద్దీలాల్‌ అనుబంధ సంస్థ వైష్ణవి బులియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతాల్లోకి రూ.28 కోట్లు జమ చేసిన నీల్‌సుందర్‌ ఆ మేరకు బంగారం ఖరీదు చేసినట్లు రికార్డులు రూపొందించాడు. స్వల్ప వ్యవధిలోనే ఆ మొత్తాన్ని ముసద్దీలాల్‌ యాజమాన్యం నీల్‌సుందర్‌ సంస్థకు చెందిన రెండు ఖాతాల్లోకి మళ్లించింది. ఈ విషయం గుర్తించిన సీసీఎస్‌ పోలీసులు ముసద్దీలాల్‌ సంస్థలకు అష్టలక్ష్మి సంస్థకు మధ్య బంగారం క్రయ విక్రయాలకు సంబంధించి డెలివరీ, రిసీవ్డ్‌ రసీదుల కోసం ఆరా తీశారు. అలాంటివి లేవని తేలడంతో ఈ మొత్తం సైతం మార్పిడికి సంబంధించిందని నిర్ధారించి నీల్‌సుందర్‌ను అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు