ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్ల రుణం

16 Mar, 2019 02:21 IST|Sakshi
శుక్రవారం ఢిల్లీలో పీఎఫ్‌సీ చైర్మన్‌ రాజీవ్‌శర్మకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎస్‌ ఎస్‌.కె జోషి. చిత్రంలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

పీఎఫ్‌సీతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు సఫలం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్ల మేర రుణం అందించేందుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) అంగీకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్‌  ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌.కె.జోషి, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు , ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఢిల్లీలో పీఎఫ్‌సీ చైర్మన్‌ రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఎల క్ట్రో మెకానికల్‌ వర్క్స్‌కు ఆర్థిక సహకారం అందించే విషయంపై చర్చించారు. తెలంగాణ జి.ఎస్‌.డి.పి., రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు, ఆర్థిక క్రమశిక్షణ, తిరిగి చెల్లించే సామర్థ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న పీఎఫ్‌సీ తెలంగాణ ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు రూ.18 వేల కోట్ల మేర రుణం ఇచ్చేందుకు పీఎఫ్‌సీ అంగీకారం తెలిపిందని వెల్లడించాయి. 

గతంలోనూ పీఎఫ్‌సీ నిధులు 
పీఎఫ్‌సీ గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులకు, విద్యుత్‌ రంగ సంస్థలకు నిధులు సమకూర్చింది. తెలంగాణలో నిర్మిస్తున్న విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు, ఇతర నిర్మాణాలకు విద్యుత్‌ సంస్థలకు రూ.23 వేల కోట్లను పీఎఫ్‌సీ మంజూరు చేసింది. గతంలో నూ తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టుల ఎలక్ట్రో మెకానికల్‌ పనుల కోసం రూ.17 వేల కోట్లను అందించింది. తాజాగా మరో రూ.30 వేల కోట్లు అందించడానికి అంగీకరించింది. ఈ సందర్భంగా పీఎఫ్‌సీ చైర్మన్‌కు తెలంగాణ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది.

వేగవంతం కానున్న ప్రాజెక్టులు
తెలంగాణలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం భారీ నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. రాష్ట్ర బడ్జెట్లోనే ఏటా రూ.25 వేల కోట్ల మేర నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం నిర్మాణం చివరిదశలో ఉండగా పాలమూరు, సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మా ణం వేగంగా జరుగుతోంది. అందుకోసమే పీఎఫ్‌సీ నుంచి రుణం తీసుకునేందుకు చర్చలు జరిపి సఫలమైంది.

మరిన్ని వార్తలు