రూ.400 కోట్లతో ఉపాధి కల్పన కార్యాలయాల ఆధునీకరణ

7 Jul, 2015 23:59 IST|Sakshi

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి కల్పన కార్యాలయాలను ఆధునీకరించేందుకు మొదటి దశగా రూ.400 కోట్ల ఖర్చు చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దిల్‌కుషా అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 20న ఢిల్లీలో 3 రోజుల పాటు జాతీయ కార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని చెప్పారు.

కనీస వేతనాలను కనీసం రూ.15 వేల వరకైనా పెంచాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. అయితే కేంద్రం నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేయాలని పేర్కొన్నారు. కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నామని అందులో భాగంగానే ఈఎస్‌ఐలో మెరుగైన సేవలు అందించడంతో పాటు త్వరలోనే 8వేల ఉద్యోగాలకు నియామకాలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 5 లక్షల కార్మిక కుటుంబాలు ఈ సేవలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
 
 

మరిన్ని వార్తలు