కొత్త టీచర్ల వేతనాలకు రూ.430 కోట్లు

12 Dec, 2016 15:09 IST|Sakshi
కొత్త టీచర్ల వేతనాలకు రూ.430 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తే ఏటా రూ.430.78 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. గతంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన పోస్టులకు ప్రభుత్వం ఎంత మొత్తాన్ని వేతనాల రూపంలో వెచ్చించాలనే దానిపై అధికారులు ఈ మేరకు లెక్కలు తేల్చారు. పదో పీఆర్‌సీ ప్రకారం ఈ మొత్తం వెచ్చించాల్సి ఉంటుందని, భవిష్యత్తులో ఈ మొత్తం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పోస్టులు తగ్గుతాయా, పెరుగుతాయా, అనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
 
  పాఠశాలల్లో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం టీచర్ పోస్టుల భర్తీని తగ్గించుకోవడం కష్టమేనని విద్యా శాఖ భావిస్తోంది. ఆర్థిక శాఖ మాత్రం భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టుల సంఖ్యను హేతుబద్ధీకరణ ద్వారా వీలైనంత తగ్గిస్తే మేలని పేర్కొంటున్నట్లు విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని, 2017 జూన్ నాటికల్లా పాఠశాలల్లో కొత్త టీచర్లను నియమిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. 
 
 ఈ నేపథ్యంలో పోస్టులను భర్తీ చేస్తే ఏటా వెచ్చించాల్సిన రూ.430 కోట్లు చెల్లించేలా వచ్చే బడ్జెట్‌లో పొందుపరచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంత మొత్తాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా, అనే దానిపై అధికారులు సందేహిస్తున్నా.. కడియం శ్రీహరి మాత్రం టీచర్ల భర్తీని కచ్చితంగా చేపడతామని చెబుతున్నారు. ఖాళీగా ఉన్న 12,142 పోస్టులను జూన్ నాటికి భర్తీ చేసి, స్కూళ్లకు పంపించాలంటే డిసెంబర్, లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తేనే సాధ్యమవుతుంది. మరోవైపు ఈనెల 30న విద్యా శాఖ డీఈవోలతో కీలక సమా వేశం నిర్వహించనుంది. టీచర్లు, పాఠశాలల హేతుబద్ధీకరణ చేపట్టిన తర్వాత ఎన్ని పోస్టు లను డెరైక్టు రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేయా ల్సి ఉంటుందనే దానిపై తుది లెక్కలను తేల్చనుంది. ఆ తర్వాతే పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.
 
 అత్యధికంగా తెలుగు మీడియంలోనే..
 ప్రస్తుతం అత్యధికంగా తెలుగు మీడియంలోనే ఖాళీలున్నారుు. తెలుగు మీడియం స్కూళ్లలో 10,114 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు ఏటా రూ.347 కోట్లు వెచ్చించాలని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 717 పోస్టులను భర్తీ చేయాలని, అందుకు ఏటా రూ.37 కోట్లు అవసరమని పేర్కొంది. ఉర్దూ మీడియంలో 1,215 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి ఏటా రూ.41.38 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపింది. డెరైక్టు రిక్రూట్‌మెంట్ కింద రాష్ట్రంలోని డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈలలో 96 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఏటా రూ.5.4 కోట్లు వెచ్చించాలని పేర్కొంది.
 
>
మరిన్ని వార్తలు