రూ.50 లక్షల ఎర్రచందనం పట్టివేత

1 Nov, 2014 01:23 IST|Sakshi

జడ్చర్ల: అరటిగెలల మాటున ఎవరికీ అనుమానం రాకుండా రాష్ట్రాలు దాటిపోతున్న ఎర్రచందనాన్ని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. జడ్చర్ల సీఐ జంగయ్య కథనం ప్రకారం.. జడ్చర్ల మీదుగా లారీలో ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున జాతీయరహదారిపై తనిఖీలు నిర్వహించారు. వారు వెతుకుతున్న యూపీ 78ఏఎన్ 8185 నెంబర్‌గల డీసీఎం జడ్చర్ల మండలం మాచారం గ్రామం వద్ద శ్రీలక్ష్మీ నరసింహ దాబా వద్ద ఆగి ఉండడం గమనించారు.

అనుమానంతో అక్కడికి వెళ్లి విచారణ చేస్తుండగా డ్రైవర్‌తోపాటు వెంట వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. చాలాసేపటి వరకు ఎవరూ రాకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని అటవీశాఖ సీసీఎఫ్ రమణారెడ్డి, డీఎఫ్‌ఓ నరేందర్, రేంజర్ మహేందర్‌లకు సమాచారం అందించారు. వారొచ్చి దుంగలను పరిశీలించి విలువను అంచనా వేశారు. డీసీఎం ఉత్తరప్రదేశ్ సీరియల్ నంబర్‌గా ఉన్నా కర్ణాటక రాష్ట్రం బళ్లారీలో రిజిస్ట్రేషన్ అయినట్లుగా విచారణలో తేలిందని తెలిపారు.

మరిన్ని వార్తలు