రూ. 500 కోట్లతో గోదావరి పుష్కరాలు

11 Jan, 2015 01:01 IST|Sakshi
రూ. 500 కోట్లతో గోదావరి పుష్కరాలు

వేములవాడ: గోదావరి పుష్కరాలను రూ. 500 కోట్లతో ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ, గృహనిర్మాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలసి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించగా, ఇతర శాఖల ద్వారా రూ.400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు.
 
 ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా గోదావరినది ప్రవహిస్తున్న ప్రతిచోటా ప్రజలు పుష్కరాలను ఘనంగా జరుపుకునేందుకు వీలుగా భారీ ఏర్పాట్లు చేస్తామన్నారు. వైద్యం, శాంతిభద్రతలు, స్నానఘట్టాలు, తాగునీరు, టాయిలెట్స్, రోడ్లు, శానిటేషన్, రవాణాలాంటి వసతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రూ. 21 కోట్లతో స్వామి వారి విమాన గోపురానికి బంగా రు తాపడం చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 17న రాజన్న సన్నిధిలో జరుపుకునే మహాశివరాత్రి జాతరకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా  స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు భద్రాచలం మాదిరిగా జీవో జారీ చేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు