రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా! 

31 May, 2020 02:21 IST|Sakshi

రేపటి నుంచి 8 వరకు గ్రామాల్లో శానిటేషన్‌ డ్రైవ్‌..

తొలి రోజు గ్రామాల్లో పాదయాత్రలు... పంచాయతీ సమావేశాలు : మంత్రి ఎర్రబెల్లి 

సాక్షి, హైదరాబాద్‌: పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ పాలకవర్గాలు కఠినంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త పారవేస్తే.. బాధ్యులకు రూ.500 జరిమానా విధించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా గ్రామీణులకు అవగాహన కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి  శనివారం పిలుపునిచ్చారు.పల్లె ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా.. పంచాయతీల పాలనా సామర్థ్యాలను మెరుగుపరచడమే ధ్యేయంగా.. పల్లె ప్రగతి స్ఫూర్తితో జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీజనల్‌ వ్యాధులు దరిచేరకుండా.. కరోనా మహ మ్మారి పల్లె గడప తొక్కకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చదనం–పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులను కూడా ఈ డ్రైవ్‌లో భాగస్వాములను చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌లో తొలి రోజు సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించాలని, నీరు నిలిచి ఉన్న గుంతలను మూసివేయాలని సూచించారు. ఆ తర్వాత సమావేశం నిర్వహించి.. 8 రోజులపాటు చేయాల్సిన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని పిలుపునిచ్చారు. డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, దిగువ ప్రాంతంలోకి వర్షపు నీరు ప్రవహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత ఉండేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. రక్షిత నీటి పథకాలను ప్రతీ నెలా 1,11,21వ తేదీల్లో విధిగా శుభ్రపరచాలని, లీకేజీలు అరికట్టాలన్నారు.

మరిన్ని వార్తలు