ఖరీఫ్ రుణాలు 6 వేల కోట్లే!

15 Oct, 2014 01:00 IST|Sakshi
ఖరీఫ్ రుణాలు 6 వేల కోట్లే!

* రుణమాఫీ, కొత్త రుణాల పంపిణీకి నేటితో ముగియనున్న గడువు
* ఇప్పటివరకు ఇచ్చింది 5 వేల కోట్లు
* రుణమాఫీ కింద టీ సర్కారు విడుదల చేసిన రూ.4,250 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
 
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో రైతులకు రూ.6 వేల కోట్లకు మించి రుణాలు అందే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు బ్యాంకులు కేవలం రూ.5 వేల కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చాయి. రుణమాఫీ అమలు చేస్తామంటూ ప్రభుత్వం చె బుతుండడంతో.. రైతులెవరూ రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకుండా మొండికేశారు.

ఫలితంగా ఖరీఫ్‌లో రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. రుణమాఫీ నిబంధనలు, ఆర్‌బీఐతో సంప్రదింపులు, బ్యాంకర్ల నుంచి వివరాలు తెప్పించుకోవడం వంటి కసరత్తు పూర్తయ్యేసరికి ఖరీఫ్ ముగింపు నకు వచ్చింది. రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం గతనెల 23న రూ.4,250 కోట్లు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో జమ చేయాలంటూ ఆ నిధులను బ్యాంకులకు విడుదల చేసింది. అందులో ఇప్పటి వరకు రూ.13 లక్షలు మినహా మిగిలిన నిధులను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు బ్యాంకర్లు మంగళవారం ప్రభుత్వానికి వివరించారు.

రుణమాఫీ అమలుపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, బ్యాంకర్లు హాజరయ్యారు. సోమవారం నాటికి రైతులకు రూ.5 వేల కోట్ల రుణాలిచ్చినట్లు బ్యాంకర్లు తెలిపారు. సీజన్ ముగిసినందున రైతులు ఇప్పడు ఎక్కువగా రుణాలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కిసాన్ క్రెడిట్ కార్డులు వచ్చాక.. ఖరీఫ్, రబీ అంటూ కాల పరిమితి ఉండదని, రైతులు ఎప్పుడు కోరినా రుణాలివ్వాల్సిందిగా ఆర్‌బీఐ మార్గదర్శకాల్లోనూ ఉందని ఓ అధికారి చెప్పారు. రుణ మాఫీ, కొత్త రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం విధించిన గడువు బుధవారంతో ముగియనుంది. బుధవారానికి మరో రూ.వెయ్యి కోట్లు రుణాలు ఇవ్వవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు