ఖరీఫ్‌ రైతుబంధుకు రూ.6,900 కోట్లు

4 Jun, 2019 02:54 IST|Sakshi

నిధులు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు

నేటి నుంచి విడతలవారీగా రైతుల ఖాతాల్లోకి సొమ్ము 

1.38 కోట్ల ఎకరాల భూములకు అందజేత 

మూడు వారాల్లో అందరికీ అందజేసేలా కసరత్తు  

రబీలో రాని వారికి ఈ ఖరీఫ్‌తో కలిపి ఇవ్వాలంటూ విన్నపాలు

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఖరీఫ్‌లో రైతుబంధు పథకం అమలుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 6,900 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన నిధుల నుంచి విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము విడుదల చేస్తారు. సొమ్ము మంగళవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి పంపిస్తామని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ఎంత మేరకు మొదటి రోజు పంపిస్తారన్న దానిపై తమకు స్పష్టత లేదని, ఆర్థికశాఖ తన వద్ద ఉన్న నిధుల నుంచి విడుదలవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఖరీఫ్‌ ప్రారంభం కావడంతో వీలైనంత త్వరగా రైతులందరికీ విడతల వారీగా సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుం దని తెలిపాయి. వాస్తవంగా ఖరీఫ్‌కు పెట్టుబడి సాయాన్ని మే నెలలోనే ఇవ్వాలన్నది సర్కారు లక్ష్యం. కాగా ఇప్పటివరకు ఎన్నికల కోడ్‌ కొనసాగడంతో ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

2019–20 బడ్జెట్‌లో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుబంధు అమలుకోసం సర్కారు రూ. 12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో 6,900 కోట్లు ఖరీఫ్‌ కోసం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వ్యవసాయ శాఖ  లెక్కల ప్రకారం 1.38 కోట్ల ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకాలున్నాయి. ఆ మేరకు దాదాపు 54.5 లక్షలమంది రైతులకు రైతుబంధు అందించా ల్సి ఉంది. అయితే అందులో ఇంకా కొందరు రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్లను వ్యవసాయ శాఖకు ఇవ్వలేదు. సాంకేతికంగా పట్టాదారు పాసు పుస్తకం రాకుండా అన్నీ సరిగా ఉన్న రైతులు తమను సంప్రదించాలని సర్కారు ఇప్పటికే విన్నవించింది. మూడు వారాల్లోగా అందరి ఖాతాల్లోకి సొమ్ము చేరుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, గత రబీ సీజన్‌లో కొందరు రైతులకు పెట్టుబడి సాయం చేతికి రాలేదు.

వారికి ఈ ఖరీఫ్‌తో కలిపి ఇస్తారా లేదా అన్నదానిపై వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గోపాల్‌ తనకు ఖరీఫ్‌ పెట్టుబడి సాయం అందిందని, కానీ రబీ సాయం రాలేదని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన సరస్వతికి కూడా రబీ సొమ్ము అందలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఖరీఫ్‌ సొమ్ముతో కలిపి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇలా లక్షలాది మంది రైతులు రబీ సాయం అందక వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇటు రైతుబంధు.. అటు పీఎం–కిసాన్‌ 
గతేడాది ప్రభుత్వం ఒక సీజన్‌కు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వగా, ఈ సీజన్‌ నుంచి రూ.5 వేలకు పెట్టుబడి సాయాన్ని పెంచిన సంగతి విదితమే. దీంతో రైతులకు మరింత ప్రయోజనం కలగనుంది. ఐదెకరాలున్న రైతు గతంలో రూ.20 వేలు అందుకుంటే, ఈసారి రూ.25 వేలు అందుకోనున్నారు. ఒకేసారి ఇంత పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో పీఎం–కిసాన్‌ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేలను మూడు విడతల్లో ఇస్తోంది.

తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది వరకు సొమ్ము అందుకున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఐదెకరాల షరతును తొలగించి ఎన్నెకరాలున్న రైతులకైనా రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. దీంతో తెలంగాణలోని రైతులందరికీ కూడా ఆ మేరకు లాభం జరగనుంది. తెలంగాణలో రైతు బంధు ఇస్తున్న ఆసరా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం–కిసాన్‌ పథకం ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎన్నెకరాలున్నా రూ.6 వేలు మాత్రమే ఇవ్వడం, అదీ రూ.2 వేల చొప్పున మూడు విడతలు చేయడంతో దీనిపై రైతుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు.  

మరిన్ని వార్తలు