నష్టం రూ.85 కోట్లపైనే..

11 May, 2014 02:11 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. కళ్లముందే కొట్టుకుపోతూ, తడిసి ముద్దవుతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడ్డారు. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షంతో జిల్లాలో నష్టం రూ.85 కోట్లపైమాటే. వరి, మామిడి రైతులను ఈ వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. ఇంత జరిగినా అధికారులు మాత్రం నష్టం లేదంటూ ఒక్కమాటలో తేల్చిచెబుతున్నారు. ఎన్నికల పేరు చెప్పి సర్వేలకు నిరాకరిస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజులపాటు కురిసిన వర్షం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని ముంచెత్తింది. శనివారం తెరిపినివ్వడంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో కల్లాలు, మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం విలువ రూ.60 కోట్లపైమాటే అని ప్రాథమిక అంచనా. కోతకు వచ్చి నేలవాలిన వరి, కాయలు రాలిన మామిడితో మరో రూ.25 కోట్ల నష్టం రైతులకు వాటిల్లినట్లు అంచనా.

 కొన్నది 10 శాతమే...
 సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఈసారి రబీలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 13.25 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. రబీలో ధాన్యం ఒక్కసారిగా ముంచెత్తుతుందని తెలిసీ అధికారులు ఎన్నికల పేరుతో కొనుగోలు కేంద్రాల  ఏర్పాటులో జాప్యం చేశారు. చివరకు 5 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించి 619 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు 10 శాతం కొనుగోళ్లు కూడా చేపట్టలేదు. కేవలం 314 కేంద్రాలు ఏర్పాటు చేసి 30,982 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు బాధ్యత మిల్లర్లకే అప్పగించడంతో తేమ సాకుతో వారు జాప్యం చేస్తున్నారు.

 రవాణా ఆలస్యమవుతుండడంతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోంది. ధాన్యం తూకం కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే దిగుబడంతా వర్షార్పణమైంది. చాలాచోట్ల టార్పాలిన్లు అందుబాటులో లేక తడిసిపోయింది. మార్కెట్‌యార్డుల్లోనూ ఇదే పరిస్థితి. తడిసిన ధాన్యం రంగు మారి, ఇప్పుడు మొలకెత్తుతోంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారే లేరు.

 పర్యవేక్షణ కరువు
 వర్షంతో పంట నష్టం జరిగినప్పుడు పంటచేలల్లోకి వెళ్లి ప్రాథమిక అంచనా వేయాల్సిన వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల పేరు చెప్పి క్షేత్రస్థాయికి వెళ్లకుండానే.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని తేల్చిచెబుతున్నారు. కల్లాలు, మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయా శాఖలు లెక్కలోకే తీసుకోవడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా, కొనుగోళ్ల సమయంలో అన్ని శాఖలను సమన్వయం చేసే జిల్లాస్థాయి ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారి స్థాయిలో కొనుగోళ్ల పర్యవేక్షణ చేయాలని రైతులు కోరుతున్నారు.

 జిల్లాలో 12.3 మి.మీ. వర్షపాతం
 కలెక్టరేట్ : జిల్లాలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 వరకు సగటున 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 39 మండలాల్లో వర్షం కురిసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా