సాగు రుణ లక్ష్యం 31,000 కోట్లు

24 Jun, 2015 02:44 IST|Sakshi
సాగు రుణ లక్ష్యం 31,000 కోట్లు

సాక్షి, హైదరాబాద్:  2015-16 సంవత్సరానికి రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదలైంది. రూ.72,119 కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. ఇందులో రూ. 30,995 కోట్లను వ్యవసాయ రంగానికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు శంతను ముఖర్జీ, ఆర్థిక  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కేంద్ర ఆర్థిక సంయుక్త కార్యదర్శి సుబ్బారావు, నాబార్డు సీజీఎం వీవీవీ సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రూ.23,209 కోట్లు పంట రుణాలు, రూ.5,398 కోట్లు టర్మ్ రుణాలు, రూ.2,386 కోట్లు వ్యవసాయ అనుబంధ రుణాలు ఇవ్వాలని సమావేశంలోనిర్ణయించారు. విద్యారంగానికి రూ.864 కోట్లు, చిన్న పరిశ్రమల ఔత్సాహికులకు రూ.7,716కోట్లు, ఇళ్ల రుణాలు రూ.2,306కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తమ్మీద ప్రాధాన్య రంగాలకు రూ.47,359 కోట్లు, అప్రాధ్యాన్య రంగాలకు రూ.24,759 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు రుణ ప్రణాళికలో వెల్లడించారు. గత ఏడాది ఖరీఫ్, రబీల్లో రూ.18,420 కోట్లు వ్యవసాయ రుణాలు ఇచ్చామని, 98 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని పేర్కొన్నారు.
 
 రెండో విడత రుణమాఫీ 15 రోజుల్లో..
 
 రెండో విడత రుణమాఫీ సొమ్మును 15 రోజుల్లో విడుదల చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. రుణమాఫీ తొలివిడతగా గత ఏడాది రూ.4,230 కోట్లు విడుదల చేశామని, ఈసారి రూ.2,043 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ఇప్పటికే 40 శాతం సాగు ప్రారంభమైందని, ఈ నేపథ్యంలో బ్యాంకులు రైతులకు పంట రుణాలు త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల నుంచి 34 లక్షల మంది రైతులకు ‘ఎఫ్’ ఫారాలు ఇవ్వాల్సి ఉండగా.. 24 లక్షల మందికే ఇచ్చాయని పేర్కొన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను చాలా బ్యాంకులు పూర్తిస్థాయిలో అమలుచేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల రైతులకు రుణం సరిపోక ఇతర బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. గత ఏడాది రెన్యువల్స్ విషయంలో జిల్లాల్లోని కొన్ని బ్యాంకులు రైతులను ఇబ్బందిపెట్టాయని.. రైతుల రుణాల్లో 25 శాతాన్ని ప్రభుత్వం రుణమాఫీ కింద ఇవ్వగా, మిగతా 75 శాతం చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామని కొర్రీలు పెట్టాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా 75శాతం సొమ్ముకు ప్రభుత్వమే హామీ ఇచ్చినా.. రైతులను వేధించాయని మండిపడ్డారు. అలా వ్యవహరించవద్దని బ్యాంకులకు సూచించారు. ఇక గ్రీన్‌హౌస్ (పాలీహౌస్)కు రుణాలు అందజేయాలని కోరారు. కాగా రైతులకు తక్షణమే పంట రుణాలు అందజేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి కోరారు.
 
 రుణ ప్రణాళికలోని ప్రధాన అంశాలు..
 2014-15లో రూ.63,047 కోట్లతో రుణ ప్రణాళిక ఉండగా..
 ఈసారి రూ.72,119 కోట్లకు పెంచారు.
 వ్యవసాయరంగానికి గత ఏడాది కంటే రూ.3,771 కోట్లు అధికంగా రూ.30,995 కోట్లు కేటాయించారు.
 పంట రుణాలను రూ.18,717 కోట్ల నుంచి రూ.23,209 కోట్లకు పెంచారు.
 ఈ సారి వరి పంట కోసం రైతులకు రూ.9,157 కోట్ల రుణాలు ఇస్తారు.
 పప్పుధాన్యాలు సాగు చేసే రైతులకు రూ.1,214 కోట్లు, పత్తి రైతులకు రూ.4,614 కోట్లు రుణాలు ఇస్తారు.
 వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.1,271 కోట్లు కేటాయించారు.
 పాలీహౌస్ కింద రూ.1,012 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
 కోళ్ల పరిశ్రమకు రూ.437 కోట్లు ఇస్తారు.
 మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణానికి రూ.350 కోట్లు ఇస్తారు.

మరిన్ని వార్తలు