కానిస్టేబుల్‌కు రూ.18 లక్షల సాయం

7 Oct, 2017 01:59 IST|Sakshi

నిమోనియాతో విషమించిన పరిస్థితి

ఎక్మో చికిత్సతో 25 రోజులు పోరాడి బయటపడ్డ వైనం

చికిత్స ఖర్చును విచక్షణ అధికారాలతో మంజూరు చేసిన డీజీపీ

సాక్షి, హైదరాబాద్‌: విధి నిర్వహణలో బాధ్యతగా ఉంటూ ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించడం ఆ కానిస్టేబుల్‌ ప్రాణాల మీదకు వచ్చేలా చేసింది. వైరల్‌ ఫీవర్‌ కాస్త నిమోనియాగా మారి ఏకంగా ఎక్మో చికిత్స వరకు వెళ్లింది. విషమ పరిస్థితుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు రూ.18.56 లక్షల నిధులను డీజీపీ అనురాగ్‌ శర్మ  తన విచక్షణ అధికారాలతో  మంజూరు చేశారు.

చికిత్సకు రోజుకు లక్ష..
రాచకొండ పోలీస్‌ కమిషనేరేట్‌ పరిధిలోని మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి (31) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెలరోజుల క్రితం వైరల్‌ ఫీవర్‌తో రావడంతో ఎల్బీనగర్‌లోని అవేర్‌ గ్లోబల్‌ ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు జరిపిన డాక్టర్లు.. విష్ణువర్ధన్‌కు నిమోనియా ఉందని నిర్ధారించారు. పరిస్థితి విషమించడంతో ఎక్మో చికిత్స అవసరమని, దీనికి రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని ఆస్పత్రి యాజమాన్యం వివరించింది.

కిమ్స్‌ ఆస్పత్రిలో ఎక్మో (ఊపిరితిత్తులు నిర్వర్తించే పనిని ఈ పరికరం చేస్తుంది), వెంటిలేటర్‌ ద్వారా చికిత్స జరపగా 25 రోజుల తరువాత విష్ణువర్ధన్‌ కోలుకున్నాడు. ఆరోగ్య భద్రత కింద వచ్చే రూ.5 లక్షల కంటే అదనంగా 18.56 లక్షలు ఖర్చయింది. ఈ మొత్తాన్ని ఆరోగ్య భద్రత నుండి ఇప్పించవలసిందిగా డీజీపీకి పోలీస్‌ అధికారుల సంఘం నాయకులు గోపిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

తన విచక్షణ అధికారాలతో రూ.18.56 లక్షలను అనురాగ్‌శర్మ మంజూరు చేశారు. ‘కిమ్స్‌’ యాజమాన్యం శుక్రవారం మధ్యాహ్నం విష్ణువర్ధన్‌రెడ్డిని డిశ్చార్చ్‌ చేసింది. కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ఆదుకు న్నందుకు డీజీపీ, భద్రతా విభాగం ఎస్పీ గోపాల్‌రెడ్డి, పోలీస్‌ అధికారుల సంఘం నేతలకు రాచకొండ, సైబరాబాద్‌ నాయకుడు భద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు