‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌’కు రూ.200 కోట్లు

17 Oct, 2017 02:01 IST|Sakshi

పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూపు

సిద్దిపేట జిల్లా తూప్రాన్‌ వద్ద పరిశ్రమ ఏర్పాటుకు సుముఖత

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో సంస్థ ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూపు ముందుకు వచ్చింది. సిద్దిపేట జిల్లా తూప్రాన్‌ వద్ద 20 ఎకరాల్లో ఈ పరిశ్రమను నెలకొల్పనుంది. ఈ పరిశ్రమ ద్వారా 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా పర్యటనలో భాగంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

గోయెంకా గ్రూపు చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకాతో మంత్రి సమావేశమై ఫుడ్‌ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌ రంగాల్లో తెలంగాణ రైతులకు సహకారం అందించాలని కోరారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ ధరకు అమ్ముకునేలా స్థానికంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు గోయెంకా గ్రూపు అంగీకరించింది. తూప్రాన్‌ వద్ద ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ–విటా, టూ– యమ్మీ బ్రాండ్లకు చెందిన ఆహారోత్పత్తులను ఇక్కడ తయారు చేయనుంది.

ఈ మేరకు కేటీఆర్‌ సమక్షంలో గోయెంకా గ్రూపు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వ విధానాలను, రాష్ట్రానికి ఉన్న బలాలను గుర్తించి రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గోయెంకా గ్రూపునకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేటీఆర్‌ శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ చైర్మన్‌ హేమంత్‌ కనోరియాతో సమావేశమై రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

ఈ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలు, ప్రాజెక్టుల వివరాలను అందజేశారు. హైదరాబాద్‌ లో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ పార్కుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఇండస్ట్రియల్‌ పార్కులకు ఆర్థిక సహకారం అందించే అవకాశాలను పరిశీలిస్తామని హేమంత్‌ కనోరియా తెలిపారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం జపనీస్, చైనీస్, కొరియన్‌ పెట్టుబడిదారులతో త్వరలో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటుకు సహకరిస్తామన్నారు.  


ఉత్పత్తి రంగంపై ప్రాధాన్యత..
‘మేక్‌ ఇన్‌ తెలంగాణ’నినాదం ద్వారా ఉత్పత్తి రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కోల్‌కతాలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సహకారాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానాల ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమలకు, పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఇచ్చే సహకారం గురించి తెలియజేశారు.   

మరిన్ని వార్తలు