ట్రస్టు సొమ్ముపక్కదారి..

31 Jul, 2018 09:12 IST|Sakshi
ప్రభుత్వం తీసుకున్న చర్చి స్థలం

రూ.5.2 కోట్ల చర్చి నిధులు.. నకిలీ అకౌంట్‌లో జమ

మహోన్నత వ్యక్తి ఆశయానికి తూట్లు

మెథడిస్ట్‌ సేవలకు గండి

గతంలో విద్య, వైద్యంతో వేలాది మందికి ప్రాణదానం, అక్షరజ్ఞానం

ప్రస్తుతం నిధులు కరువై పరిస్థితి దయనీయం

జిల్లా కేంద్రంలోని మెథడిస్ట్‌ చర్చి నిధులు దుర్వినియోగమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రస్టు ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు జట్టుగా మారి.. రూ.5.2 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి పట్టించారు. దీనికి సంబంధించి.. ట్రస్టు సభ్యులు, విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. 

వికారాబాద్‌ : అమెరికాకు చెందిన క్రాఫర్డ్‌ అనే మహిళ తన కూతురు హాల్దా పేరిట వికారాబాద్‌లో మిషన్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. 1913లో పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా సమీపాన 5.7 ఎకరాల విస్తీర్ణంలో సేవలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్యంతో పాటు విద్య అందించాలనే సంకల్పంతో పాఠశాలను నెలకొల్పారు. అంతేకాకుండా మెథడిస్ట్‌ చర్చి, ఆస్పత్రి, విద్యా విభాగాల్లో పనిచేసే సిబ్బంది కోసం క్వార్టర్స్‌ నిర్మించి చేయూతనిచ్చారు. మొత్తం 120 ఎకరాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడ్డారు.

ప్రజల కనీస అవసరాలను తీర్చడం కోసం విద్య, వైద్యంతో వేలాది మందికి ప్రాణదానం, అక్షర జ్ఞానం అందించారు. దాదాపు వంద ఏళ్లకు పైగా సమాజ సేవలో ఆపన్నహస్తం అందించారు. కొద్ది సంవత్సరాల క్రితం క్రాఫర్డ్డ్‌ కన్నుమూశారు. ఆ తర్వాత ట్రస్తు ఆస్తుల పరిరక్షణ కోసం హైదరాబాద్‌ రీజియన్‌గా తీసుకొని ట్రస్టీని ఏర్పాటు చేశారు.

క్రాఫర్డ్‌ ఉన్నన్ని రోజులు విద్య, వైద్యం, సేవల పరంగా ఈ ప్రాంత ప్రజలు ఎంతో లబ్ధిపొందారు. అనంతరం కాలక్రమేణా ఈ సేవలకు గండిపడింది. పాఠశాలలో ఒకప్పుడు 4 వేల మంది విద్యార్థులు చదువుకుంటే.. ప్రస్తుతం వీరి సంఖ్య 40కి చేరింది. వైద్యాస్పత్రిలో నిధులు లేక సేవలు నీరుగారుతున్నాయి.  

దుర్వినియోగం ఇలా... 

మెథడిస్ట్‌ ఆస్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దేశ వ్యాప్తంగా ఏ రీజియన్‌లో జరిగినా సెం ట్రల్‌ ట్రెజరీ ముంబైలో ఉన్న ఖాతాలోకి డబ్బులు వెళ్లాలనే నిబంధన (బుక్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌) బైలాస్‌ ప్రకారం ఉంది. కానీ దీనికి భిన్నంగా.. పరిహారం కింద వచ్చిన డబ్బులను డీఎస్‌ తిమోథీ హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ చిరగల్లిబ్రాంచ్‌లో ఉన్న ఖాతా నంబర్‌ 35736421990లోకి దారి మళ్లించారు.

మెథడిస్ట్‌ చర్చి పేరు మీద వచ్చిన నష్టపరిహారాన్ని ఈయన సెంట్రల్‌ ట్రెజరీ అకౌంట్‌ ముంబైలోని ఖాతాలో జమ చేయకుండా హైదరాబాద్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌ పేరున ఉన్న ఖాతాలో డిపాజిట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారని స్థానిక సంఘా లు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఇదిలా ఉండ గా సదరు వ్యక్తి రూ.25 లక్షలను ఇటీవల పట్టణానికి చెందిన పారిశ్రామిక కంపెనీ ఖాతాలో జమచేయడంతో పాటు.. ఈ మొత్తాన్ని లంచాల రూ పంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులకు అందజేశారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా డివిజన్‌ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న ఓ వ్యక్తికే ఎక్కువ మొత్తంలో ముట్టజెప్పినట్లు సమాచారం. ఈ అన్యాయాన్ని జీర్ణించుకోలేని పలువురు చర్చి సభ్యులు సీబీఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇన్‌కంట్యాక్స్‌ శాఖలకు ఫిర్యాదు చేశారు.   

చెక్కు రూపంలో పరిహారం... 

ప్రభుత్వం నుంచి మంజూరైన నష్టపరిహారాన్ని వికారాబాద్‌ ఆర్డీఓ చెక్కు రూపంలో అందజేశారని ట్రస్టు సభ్యులు చెప్పారు. ఈ నిధుల నుంచి డీఎస్‌ తిమోథీ రూ.25 లక్షలు వికారాబాద్‌లోని ఓ సుద్ద ఫ్యాక్టరీకి ఆర్టీజీఎస్‌ చేశారన్నారు. మరో వ్యక్తికి రూ.50 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు వివరించారు.

డబ్బులు కొల్లగొట్టిన వారిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు. దీనిపై సీబీఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొంటున్నారు. ఇందుకోసం చర్చి మెంబర్లతో సంతకాలు సేకరిస్తున్నామని, నిధుల పక్కదారిపై త్వరలోనే ఫైల్‌ సిద్ధం చేసి సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

డబ్బులు కాజేశారు 

మెథడిస్ట్‌ చర్చి ఆస్తులు అమ్మడానికి ఎవరికీ హక్కులేదు. ఒక వేళ అమ్మాలి అనుకుంటే చర్చి కమిటీ అప్రూవల్‌ తీసుకోవాలి. కొంతమందితో కుమ్మౖక్కైన బిషప్‌ రూ.5 కోట్లకు పైగా డబ్బులను కాజేశారు. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. చిన్ననాటి నుంచే చర్చి సభ్యుడిగా ఉన్నా. పది నెలల క్రితం చర్చి పేరున ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను స్థానిక ఆర్డీఓతో కలిసి డీఎస్‌ తిమోథీ, బిషప్‌ స్టీఫెన్, దయానంద్‌ కొల్లగొట్టారు. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం.

 – జేమ్స్, చర్చి సభ్యుడు

బిషప్, డీఎస్‌ హస్తం ఉంది 

మెథడిస్ట్‌ ఆస్తులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఏ రీజియ న్‌లో ఆర్థిక లావాదేవీలు జరిగినా ముంబైలోని సెంట్ర ల్‌ అకౌంట్‌లో జమ చేయాలి. దీనికి విరుద్ధంగా చర్చి డబ్బులను హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ అకౌంట్‌లోకి వేయ డం వెనక బిషప్‌తో పాటు డీఎస్‌ హస్తం ఉంది. ఇక్కడి ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఏమీ లేదు.

రోడ్డుకు సంబంధించిన నష్టపరిహారాన్ని వాళ్లు సొంత అకౌంట్‌లో వేసుకునేందుకు వీల్లేదు. హైదరాబాద్‌లోని చిరగల్లిలో ఉన్న ఎస్‌బీఐ అకౌంట్‌లో తిమోథీ పేరు ఉన్న ఖాతాలో జమ కావడం ఏమిటో అర్థం కావడం లేదు.ఒకసారి రూ.69 లక్షలు, మరోసారి రూ.4.69 కోట్లు జమయ్యాయి.  

– సుధాకర్, చర్చి సభ్యుడు  

మరిన్ని వార్తలు