ఆర్టీసీ బస్సులపై ప్రత్యేక దృష్టి

6 Feb, 2019 09:49 IST|Sakshi

ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్ల లైసెన్సులపై వేటు

3 నుంచి 6 నెలల పాటు సస్పెన్షన్‌కు ఆర్టీఏ సన్నాహాలు

రాష్‌ డ్రైవింగ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌లపైనా కఠిన చర్యలు

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి

హైదరాబాద్‌ జేటీసీ పాండురంగ్‌ నాయక్‌ వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీఏ దృష్టి సారించింది. ప్రమాదాలకు పాల్పడే ఆర్టీసీ డ్రైవర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. సాధారణంగా ప్రైవేట్‌ బస్సులు, స్కూల్‌ బస్సులు, ఇతర రవాణా వాహనాలు, వ్యక్తిగత వాహనాలను లక్ష్యంగా చేసుకొనే ఆర్టీఏ అధికారులు తాజాగా ఆర్టీసీ బస్సులను సైతంఆ జాబితాలో చేర్చారు. ప్రమాదాలకు కారకులయ్యే ఆర్టీసీ  డ్రైవర్ల  డ్రైవింగ్‌ లైసెన్సును 3 నుంచి 6 నెలల వరకు సస్పెన్షన్‌ చేయనున్నట్లు హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ తెలిపారు. అలాగే ప్రమాదాలు జరిగిన సమయంలో బస్సుల కండీషన్, బ్రేకులు ఫెయిల్‌ కావడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో  ఆర్టీసీ బస్సుల కారణంగా జరిగే  ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో సిటీ బస్సుల ప్రమాదాల నియంత్రణపై ఆర్టీఏ దృష్టి సారించింది. ‘ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను పట్టించుకోవడం లేదు. 

ట్రాఫిక్‌ నియమాలను బేఖాతరు చేస్తున్నారు. సిటీ బస్సులపైనే ప్రతి రోజు వందల కొద్దీ ట్రాఫిక్‌ చలానాలు నమోదవుతున్నాయి. ఇది రాష్‌ డ్రైవింగ్‌కు నిదర్శనం.’అని జేటీసీ పేర్కొన్నారు. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణాశాఖ పలు కార్యక్రమాలను చేపట్టింది. వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపైన అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య శిబిరాలను, డ్రైవర్లకు కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. మరోవైపు వాహనాలు నడిపే సమయంలో పాటించాల్సిన మెలకువలపై నగరంలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో  అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు జేటీసీ చెప్పారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ డ్రైవర్లలో కూడా అవగాహన పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాలకు పాల్పడే ఆర్టీసీ  డ్రైవర్లు ఇక నుంచి కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

ప్రమాదాల తీవ్రత ఎక్కువ..
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 3,550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో కనీసం వెయ్యి బస్సులు కాలం చెల్లినవే. ఈ బస్సుల కండిషన్‌ ఏ మాత్రం బాగుండదు, తరచూ బ్రేక్‌డౌన్స్‌కు గురవుతున్నాయి. బస్సుల పరిస్థితి  ఇలా ఉంటే  డ్రైవర్లలో  నైపుణ్యం సైతం కొరవడుతోందనే  విమర్శలు  వ్యక్తమవుతున్నాయి. నగరంలోని వివిధ డిపోల  పరిధిలో సుమారు 10 వేల మందికిపైగా డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో, విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తతను పాటించే  మొదటి తరం డ్రైవర్లు మినహా ఇటీవల కాలంలో నియమించిన చాలామందిలో డ్రైవింగ్‌ నైపుణ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పనిఒత్తిడి, ట్రాఫిక్‌ రద్దీ, రోడ్లు సరిగ్గా లేకపోవడం వంటి ప్రతికూల అంశాలతో పాటు, నిర్లక్ష్యం కూడా డ్రైవర్ల విధి నిర్వహణను ప్రభావితం చేస్తోంది.

గతేడాది మాదాపూర్‌లోని ఒక బస్టాపులో నిల్చున్న ఇద్దరు ఆటోడ్రైవర్లు, మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను సిటీ బస్సు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ దగ్గర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇలా తరచూ ఎక్కడో ఒక చోట బస్సులు ప్రమాదాలకు పాల్పడుతున్నాయి. సరైన నిఘా, నియంత్రణ లేకపోవడంతో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సులు నడపడం సాధారణంగా మారింది. మరోవైపు చాలా చోట్ల ఆర్టీసీ డ్రైవర్లు లైన్‌ నిబంధనలు పాటించకుండా దూసుకొస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు, ఇతర వాహనాలకు అవకాశం ఇవ్వకుండా పరుగులు తీస్తున్నారు.  బస్టాపుల్లో బస్సులు నిలపకుండా, రోడ్డు మధ్యలోనే నిలిపివేయడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించడం వంటి అంశాలను కూడా ఆర్టీఏ తీవ్రంగా పరిగణిస్తోంది. 

శిక్షలు కఠినం..
ఈ నేపథ్యంలో ప్రమాదాలకు పాల్పడే ఆర్టీసీ డ్రైవర్లపై ఒక వైపు కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, మరోవైపు వారు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు  జేటీసీ పాండురంగ్‌ నాయక్‌ అభిప్రాయపడ్డారు. సిటీ బస్సుల వల్ల ప్రమాదాలు జరిగి వాహనదారులు, పాదచారులు  మృత్యువాత పడితే 6 నెలలు, గాయాలపాలైతే  3 నెలల పాటు  డ్రైవర్ల లైసెన్సు రద్దు చేస్తామన్నారు. ప్రమాద తీవ్రతననుసరించి కఠిన చర్యలు విధించనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు