ఆర్టీఏలో..అలజడి!

17 Jun, 2019 12:28 IST|Sakshi

జిల్లా ఆర్టీఏలో రోజురోజుకు ముసలం ముదురుతోంది. ఎంవీఐలు మొదలు ఇతర ఉద్యోగులు సైతం ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపడంలేదు.  ఇప్పటికే అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమవుతుండగా.. అందుబాటులో ఉన్నవారిలో పలువురు అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. దీంతో మిగతా అధికారులు, ఉద్యోగులు సైతం ఒక్కొక్కరుగా జిల్లా దాటివెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఆర్టీఏ సేవలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. లైసెన్సులు, ఆర్సీబుక్‌లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్, ట్యాక్సుల వసూలు తదితర రెగ్యులర్‌ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.

పాఠశాలల పునఃప్రారంభం నాటికే స్కూల్‌ బస్సులన్నింటికీ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. స్కూళ్లు మొదలై వారం  కావస్తున్నా ఈ విషయంపై ఇప్పటికీ దృష్టిసారించడం లేదు. ఒక్కోసారి పరిగిలో నిర్వహించాల్సిన ఫిట్‌నెస్‌ టెస్టులు, ఇతర సేవలకు సైతం వికారాబాద్‌ రప్పించుకుంటున్నారు. జిల్లాలో కేవలం పరిగిలో మాత్రమే  డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ ఉండగా.. వికారాబాద్‌లో ఎలాంటి చోదక పరీక్షలు నిర్వహించకుండానే లైసెన్స్‌లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

పరిగి:  జిల్లా పరిధిలో పని చేసేందుకు ఆర్టీ ఏ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరులో ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మూడింటికీ కలిపి ఒకే ఎంవీఐ పోస్టు ఉంది. పరిగి ఆర్టీఏ యూనిట్‌ కార్యాలయంలో ఎంవీఐ పోస్టు ఉండగా.. వికారాబాద్, తాండూరుకు సైతం ఇన్‌చార్జ్‌ ఎంవీఐగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవలి వరకు మూడు ఆర్టీఏ కార్యాలయాల్లో ఎంవీఐగా విధులు నిర్వహించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవటంతో చెకింగ్‌ ఎంవీఐ కిషోర్‌ బాబుకు మూడు కార్యాలయాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.

ఇటీవల జరిగిన ఏసీబీ దాడులతో జంకిన ఈయన లాంగ్‌లీవ్‌పై వెళ్లిపోయారు. జిల్లాకు చెందిన మరికొందరు ఉద్యోగులు సైతం ఇక్కడ ఇమడలేక జిల్లా దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వారం రోజులుగా ఆర్టీఏ సేవలు స్తంభించాయి. ఈ విషయంలో వికారాబాద్‌ ఆర్టీఓ వాణిని వివరణ కోరగా ఇటీవల  రెండు మూడు రోజులు సేవలు స్తంభించిన మాట వాస్తవమేనని, సాధ్యమైనంత వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పక్క జిల్లాకు చెందిన జూనియర్‌ ఎంవీఐలకు జిల్లాలో ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తామన్నారు.

అధికారులకు అవినీతి మరకలు...
జిల్లాలో ఆర్టీఏ ఉద్యోగుల అవినీతి హద్దులు దాటుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.500 చేయాల్సిన పనికి రూ.2 వేలు, రూ.వెయ్యికి పూర్తయ్యే పని కోసం రూ.5 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. రూ.2 వేలలోపు ఖర్చయ్యే హెవీ లైసెన్స్‌కు ఏకంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నారు. ఇటీవల ఓ ఆర్టీఏ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. దీంతో ఆర్టీఏ అధికారుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గతేడాది జిల్లాలో విధులు నిర్వహించే ఓ అధికారి అవినీతి నిర్వాకం రాష్ట్ర సరిహద్దులు దాటిన విషయం తెలిసిందే. ఏకంగా విజయవాడలో లారీలకు బాడీ ఫిట్టింగ్‌ జరుగుతుండగానే అక్కడికే వెళ్లి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ ఇచ్చారు. ఈ ఘటనతో సదరు అధికారిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా అవినీతి మరకలంటించుకున్న అధికారికి మళ్లీ జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చి.. కొన్ని నెలల పాటు జిల్లాకు చెందిన మూడు కార్యాలయాల బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిచ్చింది.

మరిన్ని వార్తలు