ఆర్టీఏ ప్రత్యేక నంబర్లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌

9 Feb, 2020 08:10 IST|Sakshi

ఈ నెల 10 నుంచి ప్రయోగాత్మకంగా అమలు

మొదట హైదరాబాద్‌లోని 5  ఆర్టీఓల పరిధిలోనే... 

ఒక నెల తరువాత మిగతా ఆర్టీఏలకు విస్తరణ

ప్రత్యేక నంబర్లపై అక్రమాలకు కళ్లెం

సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ప్రత్యేక రిజర్వేషన్‌ నెంబర్లకు ఇక ఆన్‌లైన్‌లోనే టెండర్లు నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ సోమవారం నుంచి హైదరాబాద్‌ పరిధిలోని ఐదు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఒక నెల తరువాత రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏలకు దీనిని విస్తరిస్తారు. రిజర్వేషన్‌ నెంబర్లపై ప్రస్తుతం నిర్వహిస్తున్న టెండర్‌ ప్రక్రియ వల్ల అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు చర్యలు చేపట్టింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ విధివిధానాలను  ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో రవాణాశాఖ తాజాగా ఈ సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కొత్త విధానం మేరకు వినియోగదారులు తమకు కావలసిన నెంబర్లను ఆర్టీఏ వెబ్‌సైట్‌లోనే ఎంపిక చేసుకోవచ్చు. నిబంధనల మేరకు ఫీజు చెల్లించి, వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఆధార్, పాన్‌కార్డు తదితర డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఒక నెంబర్‌పైన ఎంత మందైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్‌ లేదా ఇతర ఆన్‌లైన్‌ పద్ధతుల్లోనే ఆర్టీఏ నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ను ఆహ్వానిస్తారు. డిమాండ్‌ బాగా ఉన్న నెంబర్‌పైన వినియోగదారులు ఎంత మందైనా పోటీ పడవచ్చు. చివరకు  ఎక్కువ మొత్తంలో బిడ్డింగ్‌ చేసిన వారికి నెంబర్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. బిడ్డింగ్‌లో నంబర్లను దక్కించుకోలేని వారికి  వారు చెల్లించిన డబ్బులు ఆ తరువాత 48 గంటల్లో తిరిగి వాళ్ల ఖాతాలో జమ అవుతాయి. పోటీలో పాల్గొన్న వారికి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందచేస్తారు.

అనూహ్యమైన డిమాండ్‌... 
ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారుల్లో అనూహ్యమైన డిమాండ్‌ ఉంది. ఖైరతాబాద్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో “9999’ నెంబర్‌కు వాహనదారులు రూ.10 లక్షల వరకు కూడా చెల్లించేందుకు పోటీపడుతున్నారు. ఖరీదైన హైఎండ్‌ కార్లను, బైక్‌లను కొనుగోలు చేస్తున్న వినియోగదారులు నచ్చిన నెంబర్ల కోసం ఎన్ని రు.లక్షలైనా వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో రవాణాశాఖకు ప్రత్యేక నెంబర్లపైన ఏటా రూ.50 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. ‘0009, 999, 9999, 1234, 6666, 2233, 7777,1111’ వంటి నెంబర్లకు భారీ డిమాండ్‌ ఉంది. కొన్ని రకాల నెంబర్లను అదృష్ట సంఖ్యలుగా భావిస్తుండగా, మరికొన్ని రైజింగ్‌ నెంబర్లుగా, ఫ్యాన్సీ నెంబర్లుగా  వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇలా  ప్రత్యేక నెంబర్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దళారులు రంగంలోకి దిగారు. వాహనదారులకు కావలసిన నెంబర్‌ల కోసం ఒక బేరం కుదుర్చుకొని  ఆ తరువాత ఆర్టీఏ అధికారుల సహకారంతో సదరు నెంబర్లకు పోటీ లేకుండా దక్కించుకోవడం లేదా,  ఆ నెంబర్లకు  ఆ రోజు యాక్షన్‌ నుంచి మినహాయింపును ఇచ్చేసి మరుసటి రోజు లెఫ్టో్టవర్‌ (మిగిలిపోయిన) నెంబర్లుగా ఎలాంటి బిడ్డింగ్‌ లేకుండా రూ.లక్షల్లో  సొమ్ము చేసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆర్టీఏ  కేంద్రాల్లో  ఏజెంట్‌లు సిండికేట్‌గా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే  ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు  శ్రీకారం చుట్టారు.
 
5 కేంద్రాల్లో అమలు ఇలా... 
నగరంలోని ఖైరతాబాద్, మెహదీపట్నం, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయాల్లో  ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఐదు ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో  వాహనదారులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకొని, ఫీజు చెల్లించి, బిడ్డింగ్‌లో పాల్గొనవలసి ఉంటుంది. ఒక నెంబర్‌ కోసం  ఒక్కరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉండి, ఎక్కువ మొత్తంలో చెల్లించిన వారికి  నెంబర్‌ను కేటాయిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు  ఒక్కరే దరఖాస్తు చేసుకొంటే అలాంటి నెంబర్లు పోటీ లేకుండానే  లభిస్తాయి. కాగా ఆన్‌లైన్‌ బిడ్డర్లు ఎవైనా సందేహాలుంటే నివృత్తి కోసం 040–23370081/83/84 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. 

మరిన్ని వార్తలు