బడి బండి.. భద్రత కరువండి!

11 Jun, 2019 10:18 IST|Sakshi

స్కూల్‌ బస్సుల్లో రక్షణపై నీలినీడలు  

సామర్థ్యం లేని బస్సులు 4,508  

కాలపరిమితి ముగిసినవి 1,424  

12 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌  

వేగ నియంత్రణకు స్పీడ్‌ గవర్నర్స్‌ అమలు కష్టమే  

సాక్షి, సిటీబ్యూరో: మరో 24 గంటల్లో బడి గంట మోగనుంది. బుధవారం స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో సర్వత్రా సందడి మొదలైంది. వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు తిరిగి స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పిల్లలను సురక్షితంగా  స్కూళ్లకు తీసుకెళ్లి తిరిగి తీసుకురావాల్సిన బడి బస్సులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. సామర్థ్యం లేని బస్సులు వేల సంఖ్యలో ఉన్నాయి. కాలం చెల్లినవి వందల్లో ఉన్నాయి. స్కూల్‌ యాజమాన్యాలు, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, ఆర్టీఏ నిర్లక్ష్యం ఫలితంగా పిల్లల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల 15వ తేదీనే స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ గడువు ముగిసింది. తిరిగి పునరుద్ధరించుకునేందుకు  కనీసం 20 రోజలకు పైగా గడువు ఉంది.

కానీ చాలా స్కూళ్లు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించాయి. అదే సమయంలో కొన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 2,321 స్కూల్‌ బస్సులు నమోదై ఉండగా... ఇప్పటి వరకు ఆర్టీఏ అధికారులు కేవలం 948 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించారు. 1,373  బస్సులు సామర్థ్యం లేనివే. ఈ ఒక్క జిల్లాలోనే 15 ఏళ్ల కాలపరిమితి ముగిసినవి 727 బస్సులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. మేడ్చల్, రంగారెడ్డి  జిల్లాల్లోనూ ఫిట్‌నెస్‌ లేనివి, కాలం చెల్లిన బస్సులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తంగా గ్రేటర్‌లో 13,082 స్కూల్, కాలేజీ బస్సులుంటే వాటిలో ఇప్పటి వరకు 8,574 బస్సులకు ఫిట్‌నెస్‌ నిర్వహించారు. ఇంకా 4508 బస్సులు ఫిట్‌నెస్‌ లేకుండా ఉన్నాయి. కాలం చెల్లిన బస్సులు 1424 వరకు ఉన్నాయి. ఇలాంటి కాలం చెల్లిన బస్సుల్లోనే కొన్ని స్కూళ్లు పిల్లలను తరలిస్తున్నాయి. స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ కేవలం ప్రహసనంగా మారిందనేందుకు ఇదే నిదర్శనం. 

కదలిక లేని స్కూళ్లు...
నిజానికి ఫిట్‌నెస్‌ గడువు ముగిసిన వెంటనే ఆర్టీఏ అధికారులను సంప్రదించడం స్కూళ్ల బాధ్యత. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పిల్లల భద్రతకు సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా బస్సులను నిర్వహించాలి. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు, అగ్నిమాపక యంత్రం వంటి రక్షణ చర్యలతో పాటు బస్సుల నాణ్యత, సరైన సూచికలు, హెచ్చరిక బోర్డులు, స్కూల్‌ వివరాలు వంటివి అన్ని స్పష్టంగా ఏర్పాటు చేయాలి. బడి బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించే సమయంలో మోటారు వాహన తనిఖీ ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి ఏమాత్రం తగ్గని ఆర్టీఏ అధికారి ప్రతి బస్సును విధిగా పరీక్షించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించాలి. బస్సు కొద్ది దూరం నడిపించి సంతృప్తి చెందిన తరువాతనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి. కానీ అందుకు విరద్ధంగా ఎలాంటి పరీక్షలు లేకుండానే ఫిట్‌నెస్‌ ధ్రువీకరిస్తున్నారు. కొన్ని చోట్ల కేవలం కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడం గమనార్హం. మరోవైపు కొన్ని స్కూళ్ల నిర్వాహకులు కాలం చెల్లిన బస్సులనే పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటిని తనిఖీ చేసి జప్తు చేయాల్సి ఉంది. కానీ ఆర్టీఏ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం వల్లనే  నగరంలో ఈ బస్సులపై నియంత్రణ లేకుండా పోతోందనే విమర్శలున్నాయి.

హడావుడిగా స్పీడ్‌ గవర్నెర్స్‌..  
ఒకవైపు స్కూళ్లు తెరుచుకొనే గడువు ముంచుకొస్తుండగా మరోవైపు రవాణాశాఖ హడావుడిగా ఒక జీవోను వెలువరించింది. బడి బస్సుల భద్రతకు సంబంధించిన ఈ జీవో ప్రకారం ప్రతి బస్సు కు తప్పనిసరిగా వేగ నియంత్రణ పరికరాలైన స్పీడ్‌ గవర్నర్స్‌ను బిగించాలి. గంటకు 60 కిలోమీటర్‌ల కంటే వేగంగా వెళ్లకుండా ఇవి నియంత్రిస్తాయి. కానీ ఇప్పటికే 8 వేలకు పైగా బస్సులకు తనిఖీలు చేసి సర్టిఫికెట్‌లను ఇచ్చేశారు. తిరిగి ఆ బస్సులకు మరోసారి పరీక్షలు నిర్వహించడం, స్పీడ్‌ గవర్నర్స్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం ఆచరణ సాధ్యం కాని విషయం. ఇది అధికారులకు సైతం తెలిసిన సంగతే.  

12 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌...
ఫిట్‌నెస్‌ లేని బస్సులపై ఈ నెల 12 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్‌ సి.రమేష్‌ తెలిపారు. గడువు ముగిసినా ఫిట్‌నెస్‌ ప్రక్రియ పూర్తి చేసుకోకుండా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

నగరంలో మొత్తం
స్కూల్‌ బస్సులు: 13,082
ఫిట్‌నెస్‌ పూర్తయినవి: 8,574
ఇంకా చేయాల్సినవి: 4,508
కాలం చెల్లిన బస్సులు: 1,424

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు