విద్యార్థులను దుర్భాషలాడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌!

17 Apr, 2018 11:15 IST|Sakshi
బస్సుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులు

అవుసులపల్లి వద్ద  రాస్తారోకో చేసిన విద్యార్థులు

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

మెదక్‌రూరల్‌: ‘బస్‌ పాస్‌ పెట్టుకొని రోజూ తిరుగుతున్నారు.. అంటూ’ దుర్బాషలాడిన డ్రైవర్‌ క్షమాపణ చెప్పే వరకు బస్సును కదలనీయమంటూ విద్యార్థులతో పాటు గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఈ సంఘటన మెదక్‌ మండలం అవుసులపల్లి వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీహరి, సౌమ్య, సిద్దు, జ్యోతి, నసీర్‌బేగం, వెన్నెల అనే డైట్‌ విద్యార్థులు సిద్దిపేట దగ్గరలోని డైట్‌ కళాశాలలో చదువుతున్నారు. ప్రతి రోజు పాస్‌ తీసుకొని కళాశాలకు ఆర్టీసీ బస్‌లో వెళ్లి వస్తుంటారు.

సోమవారం సాయంత్రం సిద్దిపేట నుంచి మెదక్‌కు వస్తున్న దుబ్బాక డిపోకు చెందిన బస్సులో గ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో బస్‌ డ్రైవర్‌ విద్యార్థులనుద్ధేశించి నోటికొచ్చిన మాటలు తిడుతూ దర్భాషలాడినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. డ్రైవర్‌తో బస్‌లో వాగ్వివాదం పెట్టుకుంటే దాడికి పాల్పడుతాడేమో అనే భయంతో ముందుగానే తమ గ్రామస్తులకు ఫోన్‌ ద్వారా సమాచాం అందించినట్లు తెలిపారు. అవుసులపల్లి వద్దకు చేరుకోగానే విద్యార్థులతో పాటు గ్రామస్తులు బస్సుకు అడ్డంగా నిలబడి రాస్తారోకో చేశారు. డ్రైవర్‌ క్షమాపణ చెప్పే వరకు బస్సును కదలనీయమని ఆందోళన చేశారు. సుమారు అరగంట పాటు ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న మెదక్‌ రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. మెదక్‌ డిపో మినహయిస్తే ఇతర డిపో బస్సులో ప్రయాణిస్తే ఆర్టీసీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు