పగిలిన అద్దాలు.. విరిగిన డోర్లు

12 Sep, 2018 10:52 IST|Sakshi
అద్దం పగిలిన బస్సు

బస్సు ప్రయాణం భద్రత లేకుండా పోతోంది. ప్రమాదాలతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పైనే దృష్టి పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్లకు పని ఒత్తిడి పెరగడం ప్రమాదాలకు ఒక కారణంగా చెబుతున్నారు. 

నిజామాబాద్‌నాగారం: ఘెరమైన బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఆర్టీసీ యాజమాన్యం నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. పగిలిన అద్దాలు, ఊడి పోయిన డోర్‌లతో శిథిలా వస్థలో కనిపించే బస్సులను నడపడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.ఏడాదిన్నర కాలంలో ఉమ్మ డి జిల్లాలో 28 ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటు చేసుకోగా 31 మంది మరణించారు.

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని ఆర్టీసీ బస్సుల సామర్థ్యంపై సర్వ త్రా చర్చసాగుతోంది. నిజామాబాద్‌ రీజియన్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో నిజామాబాద్‌ డిపో–1, డిపో–2, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. మొత్తం 670 బస్సుల్లో 190 అద్దె బస్సులు ఉన్నాయి. గత రెండేళ్లలో ఆర్టీసీ ప్రమాదాల శాతం 0.05 శాతం నమోదైంది. ప్రస్తుతం 1లక్ష కిలోమీటర్‌కు 0.05 శాతం ప్రమాదాల రేటు ఉంది. ఇటీవల కమ్మర్‌పల్లి, డిచ్‌పల్లి, నస్రుల్లాబాద్, నందిపేట్‌ రూట్లలో ప్రమాదాలు జరిగాయి.  
ఫలితం లేని భద్రత వారోత్సవాలు... 
ప్రతి సంవత్సరం ఆర్టీసీలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే డిపోలో ఈ వారోత్సవాలు నామ మాత్రంగా నిర్వహిస్తున్నారు. ఇచ్చిన వారికే ఉత్తమ డ్రైవర్లుగా మళ్లీ అవార్డులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రతి డిపోలో 500 మందిపైగా  కార్మికులు ఉంటే కేవలం యూనియన్‌ నాయకులకు, లేదంటే 10 మంది కార్మికులకు శిక్షణ పేరుతో మమ అనిపిస్తున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. డ్రైవర్లు నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సెలవుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని అంటున్నారు. 

ఆదాయంపైనే దృష్టి... 
ఆర్టీసీ నష్టాల్లో ఉందని యాజమాన్యం ప్రతినిత్యం డ్రైవర్లను లాభాలు తేవాల్సిందేనని ఒత్తిడి పెంచుతోంది. కేవలం ఆదాయంపైనే అధికారులు దృష్టి పెట్టారని, డ్రైవర్లపై పెరుగుతున్న ఒత్తిడితో ప్రమాదాలకు దారితీస్తుందన్న విషయాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు.
 
బస్సుల సామర్థ్యం నామమాత్రమే... 
ఆర్టీసీ నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదు. బస్సుల సామర్థ్యం తగ్గిపోయిన విషయం తెలిసినా వాటిని దూరప్రాంతాలకు పంపిస్తున్నారు. డ్రైవర్లు నానా తిప్పలు పడుతూ బస్సులను నడిపిస్తున్నారు. ఈ బస్సులను నడపడం సాధ్యం కాదంటే ఇబ్బందులకు గురి చేసి సస్పెండ్‌ చేస్తారని, అందుకే ఇబ్బందులు ఎదురైనా నడిపిస్తున్నట్లు కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధాని (ఇంద్ర) బస్సులు సైతం చెడిపోయి రోడ్డు మ«ధ్యలో మొరాయించిన ఘటనలు ఉన్నాయి. కండిషనల్‌ లేని బస్సులను వరంగల్, నాందేడ్‌ రూట్లతో తిప్పుతున్నారు. ముఖ్యంగా నాన్‌స్టాప్‌ బస్సులో కేవలం 30 మంది ప్రయాణికులు మాత్రమే ఉండాలి. అయితే నందిపేట్‌ నుంచి నిజామాబాద్, ఆర్మూర్‌ నుంచి నిజామాబాద్, బోధన్‌ నుంచి నిజామాబాద్‌ నాన్‌స్టాప్‌ బస్సుల్లో సామర్థ్యానికి మించి సుమారు 60 మంది వరకు ప్రయాణికులను ఎక్కించి రాకపోకలు సాగిస్తున్నారు.
 
అద్దె బస్సుల వైపు కన్నెత్తి చూడరు.. 
ఆర్టీసీలో అద్దె బస్సుల వైపు కన్నెత్తి చూడరు. కనీస నిబంధనలు పాటించకున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లకు సరైన శిక్షణ కూడా ఉండడం లేదు.  అద్దె బస్సుల ప్రమదాలు జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అద్దె బస్సుల్లో తరుచు గా డ్రైవర్‌కు, ఆర్టీసీ కండక్టర్‌లకు సైతం గొడవలు జరిగిన ఘనలు ఉన్నాయి. కెపాసిటీకి మించి బస్సుల రాకపోకలు సాగిస్తున్నారు. నందిపేట్‌ నుంచి  నిజామాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఒకే బస్సు ఆరు నెలల వ్యవధిలో డ్రైవర్లు అత్యంత వేగంగా నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుని ఇద్దరు ప్రయాణికులు మరణించారు. అయినా ఆ బస్సు యాథావిధిగా తిరుగుతోంది.  

తనిఖీలు చేపడుతున్నాం 
మేము ఖచ్చితంగా తనిఖీలు చేపడుతున్నాం. ఫిట్‌నెస్‌ లేని అద్దె బస్సులపై చర్యలు తీసుకుంటాము. ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. ఈ విషయంలో డిపో మేనేజర్‌లకు సైతం ఆదేశాలు ఉన్నాయి. నిబంధనలు అద్దె బస్సులు పాటించాలి. కా లం చెల్లిన బస్సులను లేకుండా చేస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా సాధ్యమైనంత వరకు చర్యలు  తీసుకుంటునే ఉన్నాము.
అనిల్‌కుమార్, డీవీఎం, నిజామాబాద్‌     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు