ఆర్టీసీ సమ్మె సక్సెస్‌..

6 Oct, 2019 08:55 IST|Sakshi
నిర్మానుష్యంగా ఆదిలాబాద్‌ బస్టాండ్‌

సాక్షి,ఆదిలాబాద్‌ : సమస్యల పరిష్కారం కోసం ఓ వైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడం, మరోవైపు ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు పూనుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆదేశాల మేరకు పాక్షికంగా బస్సులు నడిపించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ఉదయం నుంచి బస్టాండ్‌ వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని రూట్లలో మాత్రమే బస్సులు నడపడంతో గత్యంతరం లేక ప్రైవేట్‌ వాహనాలను ప్రయాణికులు ఆశ్రయించారు.

దీనిని అదునుగా తీసుకొని ప్రైవేట్‌ వాహనదారులు అందినకాడికి దండుకుంటున్నారని ప్రయాణికులు వాపోయారు. పండగ పూట సొంత ఊర్లకు వెళ్దామనుకునే వారు ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపించాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగడంతో రాత్రి 12గంటల వరకు రథచక్రాలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌తోపాటు దూరప్రాంతాల బస్సులను శుక్రవారం అర్ధరాత్రి నుంచి నడిపించలేదు.

శనివారం తెల్లవారుజాము 4 గంటలకు మొదటి బస్సు వెళ్లాల్సి ఉండగా, ఉదయం 7గంటల వరకు బస్సులు బస్‌డిపో నుంచి కదలలేదు. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని, లేనిపక్షంలో డిస్మిస్‌ చేస్తామని ఆదేశాలు జారీ చేశారు. నోటీసు బోర్డుపై డిస్మిస్‌ చేస్తామని హెచ్చరికలు సైతం అతికించారు. అయినా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మె కొనసాగించారు. ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ విజయ్‌భాస్కర్‌కు రవాణాశాఖ మంత్రి పువ్వాడ విజయ్‌కుమార్‌ ఫోన్‌ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అద్దె (హైర్‌) బస్సులన్నింటిని నడిపించాలని సూచించారు. దీంతోపాటు విద్యాసంస్థలకు దసరా పండగ సెలవులు ఉన్నందున పాఠశాలల బస్సులను కూడా వినియోగించుకునేలా చూడాలన్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
గత రెండు మూడు రోజుల నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరికతో అధికారులు ముందస్తుగా ప్రణాళికలు తయారు చేసుకున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లతోపాటు తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు చేపట్టారు. ఉదయం 6 గంటలకే వారిని పిలిపించారు. దీంతో నిరుద్యోగులతో డిపో ఎదుట సందడి వాతావరణం కనిపించింది. అవసరం ఉన్న రూట్లకు మాత్రమే బస్సులు నడిపించారు. తాత్కాలిక కండక్టర్ల నుంచి సర్టిఫికెట్లను తీసుకొని వారికి విధులు అప్పగించారు.

డ్రైవర్లను ఆర్టీఏ అధికారులతో డ్రైవింగ్‌ను పరిశీలించి బస్సులను అప్పగించారు. ఉదయం 7 గంటల తర్వాత ఆదిలాబాద్‌ బస్టాండ్‌ నుంచి బస్సులు బయల్దేరాయి. మొదట అద్దె బస్సులు నడపగా, ఆ తర్వాత తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు రోడ్డుపైకి ఎక్కాయి. ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 102 ఆర్టీసీ బస్సులు ఉండగా, 34 అద్దె బస్సులు ఉన్నాయి. 579 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

ఉట్నూర్‌ డిపో పరిధిలో 30 ఆర్టీసీ బస్సులు ఉండగా 5 అద్దె బస్సులు ఉన్నాయి. 157 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాగా శనివారం ఆదిలాబాద్‌ డిపో నుంచి మొత్తం 65 బస్సులు రోడ్డెక్కాయి. వీటిలో 33 ప్రైవేట్‌ బస్సులు ఉండగా, 32 ఆర్టీసీ బస్సులు నడిచాయి. వీటిలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మాత్రమే తిరిగాయి. డీలక్స్, సూపర్‌లగ్జరి, రాజధాని తదితర బస్సులను నడిపించలేదు. ఉట్నూర్‌ డిపోకు సంబంధించి మొత్తం 25 బస్సులు నడిపించారు. వీటిలో 5 ప్రైవేట్‌ బస్సులు నడవగా, 20 ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 

బందోబస్తు మధ్య కదిలిన బస్సులు
సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆదిలాబాద్, ఉట్నూర్‌ ఆర్టీసీ డిపోలు, బస్టాండ్‌ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు డిపోలోనికి వెళ్లకుండా, బస్సులను అడ్డుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయా డిపోల్లో డీఎస్పీల పర్యవేక్షణలో బందోబస్తు సాగింది. అదేవిధంగా ఆర్టీఏ శాఖాధికారులు సైతం ఆర్టీసీ అధికారులతో చర్చించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా నియమించిన డ్రైవర్లకు డ్రైవింగ్‌ టెస్టులు నిర్వహించారు.

ఆయా ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల యాజమాన్యాలతో ఆర్టీఏ అధికారులు మాట్లాడి వారికి నచ్చిన ప్రాంతాల్లో బస్సులు నడుపుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా బస్టాండ్‌ వైపు వచ్చే ఆయా మార్గాల్లో ఎస్సై స్థాయి అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సమ్మెకు పలు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, బీజేసీ పార్టీ మద్దతు తెలిపాయి. ఆర్టీసీ సంఘాల నాయకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు.

సమ్మెతో తగ్గిన ఆదాయం..
ఆదిలాబాద్, ఉట్నూర్‌ ఆర్టీసీ డిపోల పరిధిలో మొత్తం రోజుకు రూ.20లక్షల వరకు ఆదాయం వస్తుంది. సమ్మెతో శనివారం కేవలం రూ.50వేలలోపే ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌ డిపో పరిధిలో రోజుకు రూ.16లక్షల 82వేలు, ఉట్నూర్‌ డిపో పరిధిలో రూ.3లక్షల 70వేలు, ఆదిలాబాద్‌ డిపో పరిధిలోని తలమడుగు రూట్‌లో రూ.2,200, బోథ్‌ రూట్‌లో రూ.3వేలు, కరంజి రూట్‌లో కేవలం రూ.500 మాత్రమే ఆదాయం వచ్చింది. ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించడంతోనే ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది.

తక్కువ బస్సులు నడుపుతున్నారు
తక్కువ సంఖ్యలో బస్సులను నడిపిస్తున్నారు. సుదూర, ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండే ప్రాంతాలకు మాత్రమే బస్సులను నడిపిస్తున్నారు. దసరాను పురస్కరించుకుని ఆదిలాబాద్‌ నుంచి బేల మండలం సాంగిడి గ్రామానికి వెళ్తున్నా. తక్కువ సర్వీసులు నడుపుతున్నారు. మరిన్ని సర్వీసులను నడిపించాలి.
– రాజు, ఆదిలాబాద్‌

30 రూట్లలో బస్సులు నడిపించాం
30 రూట్లలో బస్సులు నడిపించాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 314 బస్సులు తిరిగాయి. వీటిలో 149 ప్రైవేట్‌ బస్సులు, 165 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం. కండక్టర్‌కు రోజు రూ.వెయ్యి చొప్పున, డ్రైవర్‌కు రూ.1500 చొప్పున చెల్లిస్తాం.
– విజయ్‌భాస్కర్, ఆర్‌ఎం  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిత్యావసరాల రవాణాకు ఇబ్బందులు

బాబోయ్‌ ధరలు... ఫిర్యాదుల వెల్లువ

రైతు.. రవాణా.. విక్రయం

మీకు అర్థమవుతోందా?

యుద్ధానికి సిద్ధమెలా?

సినిమా

కుకింగ్‌.. క్లీనింగ్‌

రుచి...వాసన తెలియడంలేదు

పిల్లలు పస్తులు ఉండకూడదు

కరోనా దగ్గర చేసింది!

నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి

కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం