సమ్మె సంపూర్ణం.. బస్సులు పాక్షికం!

6 Oct, 2019 08:17 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, జీతభత్యాల సవరించాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె జిల్లాలో శనివారం సంపూర్ణంగా సాగింది. కార్మికులు ఒక్కరు కూడా విధులకు హాజరుకాలేదు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదులకున్నట్లుగా భావిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా కార్మికులు బేఖాతరు చేశారు. మొదటి షిఫ్టు నుంచి డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకాకపోవడంతో  అద్దె బస్సులు మినహా సంస్థకు చెందిన బస్సులు రోడెక్కలేదు.

ఆర్టీసీ జేఏసీ నాయకులు అర్ధరాత్రి నుంచే డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా అక్కడే తిష్టవేశారు. ఉదయం 5 గంటల నుంచి కార్మికులు బస్టాండ్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఇబ్బందులను ప్రయాణికులు, ప్రజలకు వివరిస్తూ భిక్షాటన చేశారు.   

తిరిగిన అద్దె బస్సులు..  
ఆర్టీసీ సమ్మె తొలిరోజు సంపూర్ణంగా జరిగినా బస్సుల బంద్‌ పాక్షికంగానే సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 10 డిపోలకు చెందిన 91 ఆర్టీసీ బస్సులు, 90 అద్దె బస్సులు, విద్యా సంస్థలకు సంబంధించిన 55 బస్సులు మొత్తం 236 బస్సులను అధికారులు నడిపించారు. ఇవే కాకుండా ఇతర ప్రైవేటు ట్రావెల్‌ వాహనాలు నడిపించారు. దసరా సందర్భంగా 90 శాతం మంది ప్రయాణికులు ఇప్పటికే స్వగ్రామాలకు చేరుకోవడంతో ప్రయాణికుల రద్దీకూడా అంతగా కనిపించలేదు. ఆర్టీసీ యాజమాన్యం బస్సులు ఏర్పాటు చేసినా ప్రయాణికులు అనుకున్నంత రాక బస్టాండ్‌ వెలవెలబోయింది.  

ఆర్టీసీ, డీటీసీ, పోలీస్‌ సంయుక్తంగా.... 
ప్రయాణికులపై సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకు ఆర్టీసీ, జిల్లా ట్రాన్స్‌పోర్టు కమిషనర్, పోలీస్‌ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా పర్యవేక్షించారు. ఆర్టీసీ, డీటీసీ   ప్రైవేటు సంస్థల నుంచి వాహనాలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. వీటిని కార్మికులు అడ్డుకోకుండా  బస్టాండ్‌లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు శాంతియుతంగా నిరసన చేపట్టడంతో కరీంనగర్‌లో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు.  

రిక్రూట్‌మెంట్‌పై యువకుల ఆసక్తి.. 
సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక విధుల కోసం కండక్టర్, డ్రైవర్ల రిక్రూట్‌మెంట్‌ చేపట్టింది. ఈ రిక్రూట్‌మెంట్‌కు యువకులు తరలివచ్చారు. 10వ తరగతి పాస్‌ అయిన వారిని కండక్టర్లుగా, హెవీ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌ ఉన్నవారిని డ్రైవర్లుగా తీసుకున్నారు. వీరికి సంబంధించిన అన్ని అర్హత పత్రాలను పరిశీలించి తాత్కాలిక విధుల్లోకి తీసుకున్నారు. జిల్లాలో 91 మంది  డ్రైవర్లు, 91 మందిని కండక్టర్లుగా విధుల్లోకి తీసుకున్నారు.  

అడ్డగోలు చార్జీలు...  
సమ్మె సందర్భంగా బస్సులు బంద్‌ ఉండటంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. కరీంనగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు ఒక్కొక్కరికీ రూ.300 నుంచి రూ.400 వరకు చార్జి వసూలు చేశారు. దగ్గరికి ప్రయాణానికి ప్రజలు ఎక్కువగా ఆటోలను ఆశ్రయించారు. 30 నుంచి 40 కిలోమీటర్ల దూరానికి మాత్రం ఆర్టీసీ నిర్ణయించిన చార్జీలు వసూలు చేయగా, దూరప్రాంతాలకు వెళ్లే వారి నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేశారు.  

బస్టాండ్‌ను పరిశీలించిన జేసీ..  
సమ్మె సందర్భంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా  కల్పించిన సౌకర్యాలను జేసీ జీవీ.శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సరిపడా బస్సులు నడుపుతున్నామని తెలిపారు. జిల్లాలో 206 ఆర్టీసీ అద్దె బస్సులు ఉండగా వాటిలో 191 బస్సులు సికింద్రాబాద్, హన్మకొండ, గోదావరిఖని, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ తదిరత ప్రాంతాలకు నడుపుతున్నట్లు వివరించారు.

డిపో మేనేజర్లు, ఎంవీఐలు ఆధ్వర్యంలో నైపుణ్యాన్ని పరిశీలించి 195 మంది డ్రైవర్లను తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. 195 మంది కండక్టర్లను విధుల్లోకి తీసుకుని బస్సులు నడుపుతున్నామన్నారు. జిల్లాలోని 79 విద్యా సంస్థలు, 17 కాంట్రాక్ట్‌ క్యారియర్‌ సీసీ బస్సులు నడుపుతున్నామన్నారు. ముందస్తుగా తెలిపిన విధంగానే ప్రయాణ చార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు జారీచేశామన్నారు. 

మరిన్ని వార్తలు