ఆర్టీసీ బస్సుకు తగిలిన విద్యుత్ తీగలు

28 Feb, 2016 02:21 IST|Sakshi
ఆర్టీసీ బస్సుకు తగిలిన విద్యుత్ తీగలు

సెస్ ఎన్నికల సిబ్బందికి త్రుటిలో తప్పిన ప్రమాదం
బస్సులో నుంచి కిందకు దూకిన ఎన్నికల సిబ్బంది
సంఘటన స్థలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళన
సెస్ ఎండీ నాంపల్లి గుట్టను నిలదీత
 

సిరిసిల్ల రూరల్ :  సెస్ ఎన్నికల సిబ్బంది త్రుటిలో విద్యుత్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెస్ ఎన్నికల రూట్ అధికారుల నిర్లక్ష్యంతో సిరిసిల్ల మండలం పెద్దూరు శివారులో 50 మంది ఎన్నికల సిబ్బంది ప్రయాణం చేస్తున్న ఆర్టీసీ బస్సుకు శనివారం సాయంత్రం విద్యుత్ వైర్లు తగిలి మంటలు లేచాయి. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో బతుకు జీవుడా అంటూ అందరూ కిందకు దూకారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విద్యుత్ సిబ్బంది సాయంతో బస్సును సురక్షితంగా బయటకు తీయించారు. విషయం తెలుసుకున్న సెస్ ఎండీ నాంపల్లిగుట్ట సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంతలో తేరుకున్న ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగారు.

సెస్ అధికారుల తీరును నిరసించారు. ఎన్నికల రూట్ మ్యాప్‌ను సెట్ చేసిన అధికారుల తీరును ఎండగట్టారు. ‘మా ప్రాణాలు పోతే..ఎవరు బాధ్యత వహిస్తారు’ అని సెస్ ఎండీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సిబ్బంది తమతో నిర్లక్ష్యంగా మాట్లాడారని, వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్య తీసుకుంటామని, ఎన్నికల విధులకు హాజరు కావాలని నాంపల్లిగుట్ట కోరడంతో శాంతించారు. ప్రమాదంపై సిరిసిల్ల పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 సిరిసిల్ల పట్టణంలో..
సిరిసిల్ల : పట్టణం నడిబొడ్డున శనివారం మధ్యాహ్నం త్రుటిలో భారీ విద్యుత్ ప్రమాదం తప్పింది. శివనగర్ జెడ్పీ హైస్కూల్ ఎదుట కామారెడ్డి ప్రధాన రహదారిలో విద్యుత్ వైరు తెగి కిందపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పుడు కామారెడ్డి డిపో బస్సు సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట వైపు వెళ్తోంది. రెండు క్షణాలు ముందుగా విద్యుత్ తీగ తెగి ఉంటే బస్సుపై పడి భారీ ప్రమా దం జరిగేది. విద్యుత్ తీగలతో మంట లు చెలరేగడంతో స్థానిక యువకులు కర్రల సాయంతో వైర్లను తొలగించారు. అదే ప్రాంతంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు సాగుతుండడంతో ఒకే వైపు నుంచి బస్సులు, వాహనాల రాకపోకలు సాగుతూ రద్దీగా ఉంది. ఇలాంటి సమయంలో విద్యుత్ తీగలు తెగిపడి మంటలు రేగడంతో స్థానికులు ఆందోళనకుగురయ్యారు. రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేసి తెగిన విద్యుత్ తీగను సరిచేశారు.  
 

>
మరిన్ని వార్తలు