ఆ నివేదికను రద్దు చేయాల్సిందే

11 Oct, 2014 01:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకంపై షీలాబేడీ కమిటీ ఆదేశంతో ఓ ప్రైవేటు చార్టర్డ్ అకౌంట్స్ సంస్థ రూపొందించిన నివేదికపై ఆర్టీసీ తెలంగాణ అధికారులు, కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. నివేదికను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టడంతో శుక్రవారం జరగాల్సిన ఆర్టీసీ పాలకమండలి సమావేశం రద్దయింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి, మియాపూర్‌లోని బస్‌బాడీ వర్క్‌షాపుల విలువను మూల్యాంకనం చేసిన ప్రైవేటు కన్సల్టెన్సీ ఇటీవలే ఆర్టీసీకి నివేదిక అందజేసింది. దానికి అధికార ముద్ర వేసేందుకు శుక్రవారం పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో నివేదిక ఆమోదింపజేసి షీలాబేడీ కమిటీకి అందజేయాల్సి ఉంది. ఇన్ని రోజులు నివేదికను రహస్యంగా ఉంచిన అధికారులు సమావేశం నేపథ్యంలో గురువారం రాత్రి ఆర్టీసీ బోర్డు సభ్యులకు అందజేశారు. అందులోని వివరాలు చూసిన జేఏసీ అగ్గిమీద గుగ్గిలమైంది. గత మేలో ఆర్టీసీ ఈడీల కమిటీ చేసిన మూల్యాంకనం వివరాలకు ఈ నివేదికలో అంశాలు భిన్నంగా ఉండడం, రూ.1,093 కోట్ల తెలంగాణ ఆర్టీసీ నష్టాలను రూ.1,700 కోట్లుగా చూపడం, నగరంలోని మూడు స్థిరాస్తుల భూముల విలువను కూడా లెక్కించి 58:42 నిష్పత్తి లెక్కన రెండు రాష్ట్రాలకు పంచాలని సూచించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవి తెలంగాణ ఆర్టీసీకి తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పాలక మండలి సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా అంతకు గంటకు ముందే జేఏసీ నేతలు బస్‌భవన్‌కు చేరుకున్నారు. ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రారావు రాగానే ఆయనకు ఒక వినతి పత్రం అందజేశారు. ప్రైవేటు కన్సల్టెన్సీ నివేదిక కుట్రపూరితంగా తయారైనందున దాన్ని ఎట్టి పరిస్థితిలో ఆమోదించొద్దని, లేకుంటే ఉద్యమిస్తామని ఆయనకు స్పష్టం చేశారు.
 
 అప్పటికే అక్కడికి చేరుకున్న బోర్డు సభ్యులు చంద్రవదన్, శివశంకర్‌లకు కూడా ఆ వినతి పత్రాలను అందజేశారు. దీంతో తమకు కొంత సమయం కావాలని ఆర్టీసీ ఎండీ చెప్పారు. అనంతరం మిగతా అధికారులతో తన చాంబర్‌లో చర్చించారు. ఈ సమయంలో ఆర్టీసీ తెలంగాణ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేందర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, తెలంగాణ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిలతో పాటు సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రైవేటు కన్సల్టెన్సీ నివేదికను రద్దు చేయాలని, దాన్ని ఆమోదింపచేసేందుకు యత్నించిన ఆర్టీసీ ఫైనాన్షియల్ అడ్వయిజర్‌ను సస్పెండ్ చేయాలంటూ జేఏసీ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. గంట తర్వాత జేఏసీ నేతలను పిలిచిన ఆర్టీసీ ఎండీ.. ఉన్నది ఉన్నట్లుగా నివేదికను ఆమోదించడం లేదన్నారు. జేఏసీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్డు ముందు ఉంచుతామని, అందుకోసం ప్రస్తుత బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన చట్టంలో సూచించినట్లుగా మాత్రమే నివేదిక తయారు చేయాలని, ఇందుకు మరో సంస్థతో నివేదిక రూపొందించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. త్వరలో ప్రైవేటు సంస్థ నివేదిక లోపాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. మరో పక్షం రోజుల్లో పాలక మండలి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు