సమ్మె విరమిస్తేనే చర్చలు!

20 Oct, 2019 02:23 IST|Sakshi

కార్మిక సంఘాలకు తేల్చి చెప్పే యోచనలో ఆర్టీసీ ఎండీ 

హైకోర్టు ఆదేశంతో సంప్రదింపులకు పిలిచే ఆలోచన

సాక్షి, హైదరాబాద్‌:  మూడు రోజుల్లో ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రక్రియ పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కార్మికులతో సంప్రదింపులకు ఆర్టీసీ ఎండీ కసరత్తు చేస్తున్నారు. అయితే, కార్మిక సంఘాలు ముందు భేషరతుగా సమ్మె విరమించుకుంటేనే చర్చలకు అవకాశం ఉంటుందనే సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద ఓ సారి చర్చ జరిగింది. రెండు రోజుల క్రితం హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై స్పందిస్తూ, కార్మిక సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమ్మెలో ఉన్న వారు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయినట్టేనని, భవిష్యత్తులో వారితో ఎలాంటి చర్చలు ఉండవని సీఎం తేల్చి చెప్పినప్పటికీ, హైకోర్టు మాత్రం కార్మికులతో చర్చించాల్సిందేనని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది.

తదుపరి వాయిదా ఈనెల 28న ఉన్నందున, అప్పటి వరకు చర్చల సారాంశాన్ని కోర్టుకు విన్నవించాల్సి ఉంది. హైకోర్టు ఎండీని నేరుగా ఆదేశించినందున, చర్చలు చేపట్టకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ ప్రగతి భవన్‌కు వెళ్లారు. కానీ సీఎం వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో భేటీ సాధ్యం కాలేదు. మరోవైపు, హైకోర్టు ఆదేశానికి సంబంధించిన పూర్తి పాఠం ప్రతి అధికారులకు అందలేదు. దానిని చూసిన తర్వాతనే స్పందించాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, చర్చలు జరపాలంటూ కోర్టు స్పష్టంగా చెప్పినందున ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ మరో పక్క అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బంద్‌కు వివిధ వర్గాల మద్దతు లభించడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.  కానీ దీనిని  అంగీకరించవద్దని ప్రభు త్వం భావిస్తోంది.

విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో.. 
సమ్మె నేపథ్యంలో పొడిగించిన సెలవులు కూడా ఆదివారంతో పూర్తి అవుతున్నాయి. దీంతో సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా బస్సుల సంఖ్య పెంచాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు