రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

6 Oct, 2019 11:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం అటు కార్మిక సంఘాలు పట్టు విడవడం లేదు. సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు  ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్టీసీ ఉన్నతాధికారులు, పోలీసులతో చర్చలు జరపనున్నారు. సమ్మె ఎన్నిరోజులు కొనసాగినా కార్మికులతో చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు.

మరోవైపు సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా కార్మికులంతా సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు తాము సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. కాగా, రెండోరోజు కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కొందరు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నా అవి సరిపడక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు రైళ‍్లను ఆశ్రయించడంతో సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సీట్ల కోసం ప్రయాణికుల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి. భద్రత దృష్ణ్యా 40 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించారు. జనరల్ బోగీల్లో తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు పోలీసులు వారిని లైన్లలో నిలబెట్టి రైళ్ళు ఎక్కించాల్సి వస్తోందని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు