బాబోయ్‌  డ్యూటీనా?

4 Mar, 2019 11:42 IST|Sakshi

 ఆర్టీసీలో పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి

 అదనప్పు ట్రిప్పులతో డ్రైవర్ల బెంబేలు 

ఖమ్మంమామిళ్లగూడెం: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో పనిచేస్తున్న డ్రైవర్లపై  ఇటీవల కాలంలో పనిభారం అధికమవుతోంది. సిబ్బంది కొరతతో అదనంగా విధులు నిర్వహించాల్సి వస్తోందని, అలసిపోతున్నామని, ఒత్తిడితో ఆందోళన చెందుతున్నామని కొందరు ఆవేదన చెబుతున్నారు. ఒక డ్రైవర్‌చేతనే రెండు మూడు రోజులు డబుల్‌ డ్యూటీ (డీడీ)ల పేరుతో వరుస డ్యూటీలు చేయించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల తీరుతో అద్దె బస్సుల డ్రైవర్లు వారంపది రోజులు వరుస డ్యూటీలు చేస్తున్నారు. డ్రైవర్లకు విశ్రాంతి తీసుకునే సమయం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఖమ్మం రీజియన్‌లో రోడ్డు రవాణా సంస్థకు సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా పీడిస్తోంది. డ్రైవర్, కండక్టర్‌ పోస్టుల ఖాళీలు భర్తీ చేయట్లేదు. రీజియన్‌లో 1117 డ్రైవర్లు విధులు నిర్వహిస్తుండగా 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 1136 కండక్టర్లు విధులు నిర్వహిస్తుండగా, 12 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే..ఇంకా అదనంగానే సిబ్బంది అవసరమవుతారని కార్మిక సంఘాల నాయకులంటు న్నారు.

మొత్తం 630 బస్సులకు గాను 600కు పైగా సర్వీసులు నడుస్తున్నాయి. ఈ లెక్క ప్రకా రం 1400 మంది డ్రైవర్లు అవసరం. ఖమ్మం డిపోలో అయితే డ్రైవర్‌ డ్యూటీ దిగడమే ఆలస్యం గేటువద్ద అధికారులు వారిని అడ్డుకొని అదనపు డ్యూటీ చేస్తే అడిగినప్పుడు సెలవు ఇస్తామని, డీడీ నగదు ఇస్తామని ఆశలు చూపించి డ్రైవర్‌ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అదనపు ట్రిప్పులు తిప్పిస్తున్నారు. అనారోగ్యంపాలైన కార్మికుడు సెలవు అడిగితే కుదరదు అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఓటీలు, డీడీలతో కార్మికులకు విశ్రాంతి అనేది లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికుల్లో అధికశాతంమంది అనారోగ్యాలపాలై ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందనేది బహిరంగ రహస్యమే.

అధికారుల అవగాహన లేమి..

రీజియన్‌ పరిధిలోని డిపోల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులకు రూట్లపై సరైన అవగాహన లేకపోవడంతో కార్మికుల పట్ల శాపంగా మారింది. పలు రూట్లలో కిలోమీటర్లు పెంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. రోడ్లు బాగాలేకపోయినా సమయం తగ్గించి, కిలోమీటర్లు పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఖమ్మం నుంచి రాజమండ్రి, సూర్యాపేట, కోదాడ రూట్లలో తిరగే బసుల సమయం తగ్గించారు. రాజమండ్రి రోడ్డు బాగాలేకపోయినా గతంలో ఉన్న ప్రయాణ సమయం తగ్గించడంతో సకాలంలో చేరుకునేందుకు డ్రైవర్‌ ఒత్తిడికి గురవుతున్నాడు. 40 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న కోదాడ ప్రాంగణానికి 1:15 గంటల సమయం మాత్రమే ఇవ్వడంతో..స్టాప్‌ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంటూ నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరుకునేందుకు అతివేగంగా వెళ్లి ప్రమాదాల బారినపడుతున్నారు.

విశ్రాంతి ఎక్కడ ? 

సంస్థలోని కార్మికులు రాత్రి, పగలు అనే తేడాలేకుండా విధులు నిర్వహిస్తుంటే..వారు విశ్రాంతి తీసుకునేందుకు సరైన వసతులే లేవు. రిజియన్‌లో ఆరు డిపోలు ఉండగా వాటిలో సగానికి పైగా విశ్రాంతిగదులు లేనివే. డబుల్‌ డ్యూటీలు చేసే డ్రైవర్లు ఉన్న గంట, రెండు గంటల సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా కండక్టర్ల పరిస్థితి మరీ దారుణం. వారికైతే రెస్ట్‌ రూముల్లో కూర్చునేందుకు కుర్చీలు కూడా ఉండవు. నైట్‌ అవుట్‌ బస్సుల డ్యూటీ చేసే కార్మికుల ఇబ్బందులైతే అన్నీఇన్నీ కావు. రాత్రి వేళ..గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై, పంచాయతీ కార్యాయాల బయట నిద్రిస్తున్నారు. గది సౌకర్యం లేకపోవడంతో విష పురుగుల భయంతో నిద్రలేని రాత్రులను గడపాల్సిన పరిస్థితి పోవట్లేదు.

 డ్రైవర్లకు శిక్షణే లేదు..

 ఆర్టీసీలో పని చేసే డ్రైవర్, కండక్టర్‌లకు సంస్థ నెలకోమారు డిపోల్లో తరగతులు, 6 నెలలకోసారి రీజియన్‌ స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ..ప్రసతం శిక్షణ తరగతులే లేవు. రెండు సంవత్సరాలుగా డ్రైవర్లకు ట్రైనింగ్‌ నిలిచిందంటే సంస్థ పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శిక్షణలో ప్రతి కార్మికుడికీ నూతన మెళకువలు నేర్పడంతో పాటు రోడ్డుపై వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంటారు. ఇలాంటి తరగతులు లేకపోవడంతో డ్రైవర్లు తమకు ఇస్తున్న బస్సులతో రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ను అధిగమించి పోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.   

మరిన్ని వార్తలు