కరోనా అనుమానితుల తరలింపునకు ఆర్టీసీ

29 Mar, 2020 04:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో క్రమంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అవసరమైతే వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలో ప్రతి డిపోలో ఐదు చొప్పున బస్సులను సిద్ధం చేసింది. ఈమేరకు ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా నగరంలో వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. బాధితుల్లో కొంతమంది విదేశాల నుంచి వచ్చినవారు ఉండగా మరికొంతమంది వారి ద్వారా సోకినవారు ఉంటున్నారు. దీంతో స్థానికంగా కూడా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతోందని స్పష్టమైంది. కోవిడ్‌ వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు అప్పటికే స్థానికంగా సంచరించి ఉండటంతో వారి ద్వారా ఎవరెవరికి వైరస్‌ సోకనుందనేది తెలియని పరిస్థితి. వారు ఎంతమందితో కాంటాక్ట్‌ అయ్యారనే వివరాలు సేకరించి, వారందర్నీ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం ఒక్కో రోజు ఏకంగా పది మంది వరకు వైరస్‌ పాజిటివ్‌గా తేలుతున్నారు. ఫలితంగా వారు కాంటాక్ట్‌ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అంతమందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలంటే పెద్ద సంఖ్యలో వాహనాల అవసరం ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వచ్చే వారం పది రోజుల్లో ఇలా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించేవారి సంఖ్య భారీగానే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందు జాగ్రత్తచర్యగా ఆర్టీసీ డిపోలకు సరిపడా డ్రైవర్లు, కంట్రోలర్లను కూడా పిలిపించి సిద్ధంగా ఉంచుతున్నారు. ఒక్కో షిఫ్ట్‌లో పది మంది చొప్పున మూడు షిఫ్టులకు కలిపి ఒక్కో డిపోలో రోజుకు 30 మంది చొప్పున డ్రైవర్లు, మరో ఐదుగురు కంట్రోలర్లను పిలిపిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా పాసులను కూడా జారీ చేశారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ డ్రైవర్లు విధులకు హాజరవుతున్నారు.

మరిన్ని వార్తలు