ఆర్టీసీలో ‘కుల’కలం!

7 Jun, 2018 03:38 IST|Sakshi

అద్దె బస్సులపై ఇద్దరు ఉన్నతాధికారుల దందా

ఓ అధికారిపై వేటు.. మరో అధికారి పదోన్నతితో కొనసాగింపు

వేటుపడ్డ అధికారి ఎస్సీ కావటంతో వివాదం

సాక్షి, హైదరాబాద్‌: ఇద్దరు అధికారులపై ఒకే తరహా ఫిర్యాదులొచ్చాయి. విజిలెన్సు విచారణలో అవి నిజమేనని తేలాయి. కానీ ఓ అధికారిని విధుల నుంచి తొలగించారు... మరో అధికారి ఆ తర్వాత ప్రమోషన్‌ అందుకుని పెద్ద పోస్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడీ అంశం ఆర్టీసీలో వివాదానికి కారణమవుతోంది. వేటు పడ్డ అధికారి ఎస్సీ కావటమే దీనికి కారణం. సొంతంగా బస్సులు కొనటం ఆర్టీసీ భారంగా భావిస్తుండటంతో కొంతకాలంగా అద్దె బస్సులను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది.

వీటి పరిమితిపై ఉన్న నిబంధనను కూడా సడలించి వాటి సంఖ్యను పెంచుకుంటోంది. ఇది కొందరు ఉన్నతాధికారులకు ఆదాయవనరుగా మారింది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఈ బస్సుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు దండుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఆ బస్సులు నడుపుకు నేందుకు అనుమతించినా, ఈ అధికారి మాత్రం ఒక్కో బస్సు నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించి, మరో జిల్లా రీజినల్‌ మేనేజర్‌కు ఆ బాధ్యత అప్పగించారు. ఆయన కూలంకషంగా విచారణ జరిపి వసూళ్లపై ఆధారాలున్నట్టు నివేదిక సమర్పించారు.  

మరో కేసులో..
వరంగల్‌లో కూడా ఇదే స్థాయి అధికారి అద్దె బస్సులపై పడి జేబులు నింపేసుకున్నాడు.  దీనిపై కూడా బస్‌భవన్‌కు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ విచారణ చేసి ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో ఆయనను   విధుల నుంచి తొలగించారు.  

రాజుకున్న కుల వివాదం
నల్లగొండలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి  పదోన్నతి పొంది బస్‌భవన్‌లో పనిచేస్తున్నారు.  ఇప్పుడు ఉన్నట్టుండి ఇది కులం రంగు పులుముకొంది. వేటుపడిన అధికారి ఎస్సీ కావటంతో ఆ వర్గం అధికారులు, సిబ్బంది దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒకే నేరానికి శిక్ష కూడా ఒకే రకంగా ఉండాలని కోరుతున్నారు. ఎస్సీ  అధికారిపై వేటువేసి, మరో కులానికి చెందిన అధికారిని కాపాడటం కుల వివక్షగానే పరిగణించాలంటూ వారు ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

తీవ్ర ఆరోపణలున్నా....
నల్లగొండ జిల్లాలో పనిచేసి బదిలీ అయిన అధికారిపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా బస్టాండ్లలో దుకాణాల కేటాయింపులో ఆయన హస్తలాఘవం ప్రదర్శించారన్నది ప్రధాన ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా పదార్థాలు, వస్తువులు అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో మిగ తా దుకాణాలు ఖాళీగా ఉండిపోయి ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. ఆయన అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత స్థానిక అధికారులు మళ్లీ వాటికి టెండర్లు పిలిచారు. కానీ దుకాణదారులతో కుమ్మక్కై ఆ అధికారి టెండర్లు రద్దు చేయించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా