సర్కారు దిగొచ్చే వరకు..

25 Oct, 2019 02:09 IST|Sakshi

సమ్మె కొనసాగిస్తామన్న ఆర్టీసీ జేఏసీ

ఆందోళన పడవద్దని ఆర్టీసీ కార్మికులకు సూచన

సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం

20వ రోజుకు చేరిన సమ్మె

సాక్షి, హైదరాబాద్‌: తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టంచేసింది. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం 20వ రోజుకు చేరుకుంది. అయితే, సీఎం కేసీఆర్‌ ఆర్టీసీపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కార్మికుల్లో ఆందోళన రేగింది. దీంతో జేఏసీ నేతలు రంగంలోకి దిగి ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అక్కడి కార్మికులతో సమావేశం నిర్వహించి ఆందోళన విరమించుకోవద్దని పేర్కొనగా, హైదరాబాద్‌లో ఉన్న జేఏసీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్మికులకు సూచనలు చేశారు. కార్మికుల రక్షణకు హైకోర్టు జోక్యం చేసుకుంటుందని, కోర్టు ఉన్నాక అన్యాయం జరిగే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీకి రూ.4,250 కోట్లు ఇచ్చినట్టు చెప్పిన మాటల్లో నిజం లేదని, కేవలం రూ.712 కోట్లు మాత్రమే ఇచ్చారని స్పష్టంచేశారు.

ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయం.. 
ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో సమ్మె కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రాస్తారోకోలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు పేర్కొన్న జేఏసీ.. దాని బదులు ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలకు వెళ్లి సమ్మెకు దారి తీసిన పరిస్థితులను విద్యార్థులకు వివరించి వారి మద్దతు కూడగట్టుకోవాలని నిర్ణయించింది. మరోవైపు గురువారం కూడా అన్ని డిపోల ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. ఉదయం వేళ కొన్ని బస్సులను అడ్డుకున్నా, పోలీసుల జోక్యంతో అవి రోడ్డెక్కాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తిప్పుతున్నా, హైదరాబాద్‌లో మాత్రం వాటి జాడే కనిపించకపోతుండటం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బస్సుల్లేక సకాలంలో విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నామని పేర్కొంటూ ఆందోళనలు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌ నల్లగొండ క్రాస్‌ రోడ్డు వద్ద కొందరు ప్రయాణికులు రోడ్డుపై నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గురువారం 6,395 బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,290 బస్సుల్లో టికెట్ల జారీ యంత్రాలు వినియోగించారని, 1531 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని అధికారులు పేర్కొన్నారు.

రేపు ఎండీకి కమిటీ నివేదిక..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశంతో ఆర్టీసీ ఎండీ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ఉన్నతాధికారుల కమిటీ రెండు రోజులపాటు చర్చించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగిలిన 21 డిమాండ్లపై సూచనలు సిద్ధం చేసింది. అనంతరం గురువారం సాయంత్రం ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మతో కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా నివేదికలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది. శనివారం తుది నివేదికను ఎండీకి అందజేయనుంది.

>
మరిన్ని వార్తలు