లక్ష్మణ్‌ను కలిసిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

11 Oct, 2019 14:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏడో రోజు విజయవంతంగా సాగుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. శుక్రవారం అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను కలుస్తున్నామని, బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ను కలిసి మద్దతు అడిగినట్లు వెల్లడించారు. ఆర్టీసీ బతికితేనే ప్రజా రవాణా అందరికి అందుబాటులో ఉంటుందని, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్‌ ఉద్యోగులు తమకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. శనివారం జరగబోయే మౌన దీక్షలో కార్మిక సంఘాల కుటుంబాలు సైతం పాల్గొంటాయని అన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌, ప్రైవేటు సెక్టార్‌, విద్యుత్‌ సెక్టార్‌ల నుంచి మద్దతు కూడగడతామని, అన్ని ప్రభుత్వ సంఘాలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.  రూ. 60, 70 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

టీజేఎస్‌ పార్టీ అధినేత కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో తన భేటీకీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలవడానికి తాను బీజేపీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. కార్మికుల ఉద్యమానికి అన్ని పార్టీలు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, దీనికి రాజకీయ పార్టీలు తోడైతే ప్రభుత్వం దిగివస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల కంటే రాజకీయం ముఖ్యం కాదని కోదండరాం పేర్కొన్నారు. . దీనికి లక్ష్మణ్‌ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పారన్నారు.

మరిన్ని వార్తలు