ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం.. కలెక్టరేట్ల ముట్టడి

28 Oct, 2019 14:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దని, ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆర్టీసీ జేఏసీ కార్మికులు బైటాయించి కలెక్టర్‌ హరీష్‌కు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ సమ్మె 24వ రోజుకు చేరిన సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు. న్యాయపరమైన పోరాటానికి మద్దతుగా అన్ని సంఘాలను, నాయకులను ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం ఉదయం కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్‌ కలెక్టర్‌ మానిక్‌ రాజ్‌కు వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యలపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
 
వరంగల్‌ జిల్లా: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 9డిపోల పరిధిలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏకశిల పార్కు నుంచి కలెక్టరేట్‌ వరకు కార్మికులు ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నేతలు సమ్మెకు మద్దతు పలికారు. కాగా కార్మికుల ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డకోగా.. కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఆర్టీసీ కార్మికుల బైటాయించి జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రాన్నిఅందజేశారు.
వికారాబాద్‌ కలెక్టర్‌ వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా చేసి వారి డిమాండ్ల వినతి పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. 
రాజన్న సిరిసిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడి చేసే యత్నంలో పోలీసులకు, ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్నాయి. 

మరిన్ని వార్తలు