3 రోజుల్లో తేల్చకుంటే సమ్మెబాట

25 Sep, 2019 02:29 IST|Sakshi

కార్మిక శాఖకు ఆర్టీసీ జేఏసీ అల్టిమేటం

నోటీసు గడువు పూర్తయిందని స్పష్టీకరణ

దసరా ప్రయాణికుల్లో టెన్షన్‌.. టెన్షన్

ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారుల నిరీక్షణ

సాక్షి, హైదరాబాద్‌: దసరాకు సొంతూళ్ల బాటపట్టేందుకు లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతున్న వేళ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘంతో కూడిన జేఏసీ సమ్మెబాటపై కార్మికశాఖకు అల్టిమేటం ఇచ్చింది. తమ డిమాండ్లపై 3 రోజుల్లోగా స్పందించకుంటే ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని స్పష్టంచేస్తూ మంగళవారం లేఖ అందజే సింది. ‘మేము సమ్మె నోటీసు ఇచ్చి 14 రోజులు గడిచింది. నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మె చేయొచ్చు. మీ సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించే తేదీ ప్రకటించలేదు. 3 రోజుల్లో ఆ తేదీని ప్రకటిస్తే సరి. లేదంటే ఇక ఆ సమావేశం ఉండదని భావించి 3 రోజుల తర్వాత సమ్మె ప్రారంభిస్తాం’అంటూ పేర్కొంది. టీజేఎంయూతో కూడిన మరో జేఏసీ కూడా సమ్మె సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సరవణ, పెండింగ్‌ బకాయిల చెల్లింపు తదితర డిమాండ్లతో ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీసు ఇవ్వగా కొన్ని సంఘాలు విడివిడిగా 2 జేఏసీలు ఏర్పాటు చేసుకొని సమ్మె కు సమాయత్తం అవుతున్నాయి. ఏ జేఏసీలో లేని ఎన్‌ఎంయూ గుర్తింపు కార్మిక సంఘం టీఎం యూ చేసే సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో సమ్మె ప్రారంభిస్తే తమ ప్రయాణాలేంటనే భయం ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు టీఎంయూ–ఈయూలతో కూడిన జేఏసీ చర్య దీన్ని మరింత పెంచింది. సాధారణంగా సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో కార్మికశాఖ సంప్రదింపుల సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే గత సోమవారమే ఈ సమావేశం ఉంటుందని నోట్‌ జారీ చేసిన కార్మికశాఖ... ఆ వెంటనే దాన్ని రద్దు చేసుకుంది. తదుపరి తేదీని కూడా ప్రకటించలేదు. దీంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

రెండు రోజుల్లో నిర్ణయం: ఇన్‌చార్జి ఎండీ 
కార్మిక సంఘాలతో ఇప్పటివరకు చర్చలకు అధికారులు సిద్ధం కాలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో అధికారుల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఆర్టీసీలో సమ్మెలపై నిషేధం ఉంది. నిషేధ కాలంలో సమ్మెకు దిగడం, కార్మికశాఖ సంప్రదింపుల సమావేశం ఏర్పాటు కాకుండానే సమ్మె చేయడం చట్టపరంగా నేరమవుతుంది. కానీ కార్మికులు బస్సులు ఆపేస్తే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే పరిస్థితి లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

దీనిపై ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మను సంప్రదించగా దసరాకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని, సమ్మె నోటీసుల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అధికారుల మాట ఎలా ఉన్నా తాము మాత్రం సమ్మెకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. దసరా సమయంలో సమ్మె చేస్తే ప్రయాణికులకు ఇబ్బందులు కలగడం వాస్తవమేనని, కానీ వాటిని దూరం చేసే అంశం ప్రభుత్వం చేతిలోనే ఉందని చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా