‘కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానించాలి’

14 Oct, 2019 15:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర పరిస్థితిపై సోమవారం గవర్నర్‌ తమిళిసైకు వినతి పత్రం అందించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ...మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో దహనకాండపై గవర్నర్‌కు వివరించామని, తమ వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు.

టీఎన్జీయూ అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వనం పలకాలని సూచించారు. ‘ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్‌ను కలవడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఉద్యోగ సంఘాలతో నిన్న భేటీ కావాలని అనుకున్నాం. అయితే డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మరణంతో కలవడం కుదరలేదు’ అని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం ఆర్టీసీ అని, తమకు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. 

ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ రాజీ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కార్మికులు ఎవ్వరూ  సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అంతేగాక కేకే రాసిన లేఖపై తాము ఓపెన్‌గా ఉన్నామని అన్నారు. 

మరిన్ని వార్తలు