మైలేజీ తక్కువ..  డ్యామేజీ ఎక్కువ! 

1 May, 2018 02:28 IST|Sakshi

కి.మీ.కు రూ.20 వరకు నష్టం

క్రమం తప్పకుండా చెడిపోతున్న విడిభాగాలు

నాసిరకం బస్సులు కావడంతో తీవ్ర సమస్యలు 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతి రెండున్నర కిలోమీటర్లకు లీటర్‌ డీజిల్‌ తాగుతున్నాయి ఆ బస్సులు.. లాభాల సంగతి దేవుడెరుగు!! ప్రతి కిలోమీటరుకు దాదాపు రూ.20 వరకు నష్టం మిగులుతోంది. ఆ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే ఆర్టీసీ ఖజానా అంతగా ఖాళీ అవుతోంది. వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టుగా మింగేస్తూ గుదిబండగా మారాయి. ఎట్టకేలకు కళ్లు తెరచిన ఆర్టీసీ యాజమాన్యం ఆ కేటగిరీలోని ఏసీ బస్సులను ఉపసంహరించాలని నిర్ణయించింది. కానీ అదే కేటగిరీలోని నాన్‌ ఏసీ బస్సులను మాత్రం కొనసాగించనుంది. వాటిని కనిష్టంగా 10 లక్షల కిలోమీటర్ల మేర తిప్పుతామంటూ తొలుత తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వాటిని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. నాటి యూపీఏ ప్రభుత్వంలోని కొందరు నేతల కమీషన్ల కక్కుర్తితో ఆర్టీసీకి బలవంతంగా అంటగట్టిన లోఫ్లోర్‌ బస్సుల కథే ఇది. 

ఆది నుంచీ అంతే.. 
పెద్ద నగరాల్లో ప్రీమియం కేటగిరీ బస్సులు తిప్పాలని నిర్ణయించిన నాటి యూపీఏ ప్రభుత్వం.. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద హైదరాబాద్‌కు 100 వరకు లో ఫ్లోర్‌ బస్సులను అందజేసింది. స్థానికంగా కంపెనీల నుంచి చాసిస్‌ కొని ఆర్టీసీనే సొంతంగా బస్‌బాడీ రూపొందించుకునే వెసులుబాటు ఉన్నా.. కొందరు రాజకీయ నేతలు కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం బస్సులు కొనిపించి సరఫరా చేశారు. లో ఫ్లోర్‌ బస్సులు పెద్ద వయసు వారికి, వికలాంగులకు సౌకర్యంగా ఉంటాయని చెప్పి అంటగట్టారు. కానీ తయారీలో లోపాలతో అవి ఆది నుంచి ఆర్టీసీకి పెద్ద గుదిబండగా మారాయి. 

ఎట్టకేలకు ఏసీ బస్సుల ఉపసంహరణ 
లో ఫ్లోర్‌ కేటగిరీలో ప్రస్తుతం 30 వరకు ఏసీ బస్సులు తిప్పుతున్నారు. భారంగా మారటంతో వాటిని ఉపసంహరించాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించింది. అవి ఇప్పటికే 5 లక్షల కిలోమీటర్ల మేర తిరగటంతో 20 వరకు బస్సులను షెడ్డుకు పరిమితం చేశారు. కానీ నాన్‌ ఏసీ బస్సులను మాత్రం 10 లక్షల కిలోమీటర్ల వరకు తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై ఇప్పుడు డిపో మేనేజర్లు గగ్గోలు పెడుతున్నారు. తాము ఎంత పకడ్బందీగా పనిచేసి ఆదాయాన్ని పెంచినా, ఈ బస్సుల వల్ల చివరకు నష్టాలే మిగులుతున్నాయని, వాటిని కూడా తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


నష్టాలు ఇలా.. 


  • సాధారణంగా సగటు ఆర్డినరీ బస్సు లీటర్‌ డీజిల్‌కు 4.8 కి.మీ. నుంచి 5 కి.మీ. వరకు మైలేజీ ఇస్తోంది. అదే ఏసీ బస్సు 3 కి.మీ. మేర ఇస్తోంది. కానీ లో ఫ్లోర్‌ నాన్‌ ఏసీ బస్సులు మాత్రం కేవలం 2.5 కి.మీ. మైలేజీ మాత్రమే ఇస్తున్నాయి. అంటే సాధారణ ఆర్టీనరీ బస్సుతో పోలిస్తే డీజిల్‌ ఖర్చు రెట్టింపవుతోంది. 

  • వీటి తయారీ, బస్‌బాడీలో లోపాల వల్ల నిర్వహణ సమస్య తీవ్రంగా ఉంటోంది. ప్రతినెలా బస్సును పూర్తిగా మెయింటెనెన్స్‌ సర్వీస్‌ చేస్తేగాని బస్సు రోడ్డెక్కని పరిస్థితి.   

  • బస్సు వెనుక వైపు ఇంజిన్‌ ఇండే ఈ తరహా బస్సుల విడిభాగాల ఖరీదు చాలా ఎక్కువ. 

  • సాధారణ బస్సులకు 24 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ప్రతిసారి ఇంజిన్‌ ఆయిల్‌ మారుస్తున్నారు. ప్రతిసారి 10.5 లీటర్ల ఆయిల్‌ను నింపుతారు. కానీ లో ఫ్లోర్‌ బస్సులకు 9 వేల కిలోమీటర్లకు ఓసారి మార్చాల్సి వస్తోంది. ప్రతిసారి 16.5 లీటర్ల మేర పోయాల్సి వస్తోంది. 

  • సాధారణ బస్సుల్లో 44 సీట్లు ఉంటుండగా వీటిలో కేవలం 32 సీట్లు మాత్రమే ఉంటున్నాయి. ఇవి డీలక్స్‌ కేటగిరీ బస్సులు కావడటంతో టికెట్‌ ఖరీదు ఎక్కువ. దీంతో ప్రయాణికులు వీటిని తక్కువగా వాడుతున్నారు. వెరసి టికెట్‌ ఆదాయం కూడా చాలా తక్కువ. 

  • ఎయిర్‌ సర్క్యులేషన్‌ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. వారానికోసారి విడిభాగాలు చెడిపోయి మార్చాల్సి వస్తోంది. 
  • ఈ బస్సుల నుంచి విపరీతమైన పొగ వెలువడుతోంది. క్రమం తప్పకుండా మెయింటెనెన్స్‌ పనులు నిర్వహిస్తున్నా, తయారీలో లోపాల కారణంగా పొగను నియంత్రించటం సాధ్యం కావటం లేదు. 
మరిన్ని వార్తలు