సీబీఎస్‌ అభివృద్ధి పనులపై సమీక్ష

4 Mar, 2019 02:57 IST|Sakshi

ఆదాయాన్ని సమకూర్చడంపై  ఆర్టీసీ అధికారుల దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని సెంట్రల్‌ బస్‌ స్టేషన్‌ (సీబీఎస్‌) పునర్నిర్మాణ, ఆధునీకరణ పనులపై రాష్ట్ర ఆర్టీసీ అధికారులు సమీక్షించారు. కొద్ది రోజుల కిందటే సీబీఎస్‌ రేకుల షెడ్డు కూలిపోవడంతో ఆ స్థలంలో ఆధునీకరణ పనులు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించారు. సీబీఎస్‌లో ప్రయాణీకులకు మెరుగైన రవాణా సదుపాయాల కల్పనతో పాటు సంస్థ వాణిజ్య పరంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీ ఈడీ, కార్యదర్శి పురుషోత్తం పర్యవేక్షణలో సీటీఎం (ట్రాఫిక్‌), సీటీఎం (ఎం అండ్‌ సీ)లతో పాటు ఇతర కమిటీ సభ్యులు సీబీఎస్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదివారం సమీక్షించారు. ఇక్కడ బస్‌ పార్కింగ్‌ స్థలాన్ని సెల్లార్‌లో కేటాయించాలని నిర్ణయించారు.

సంస్థ ఆర్థిక పరిపుష్టి కోసం 3 నుంచి మూడున్నర ఎకరాల స్థలాన్ని బీఓటీ పద్ధతిలో వాణిజ్య సముదాయాలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మినీ థియేటర్స్, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల ఏర్పాటుతో పాటు ఖాళీ స్థలంలో పెట్రోల్‌ బంకు నిర్వహణను చేపట్టే దిశలో ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వేసవిలో తీవ్రమవుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకుల సౌకర్యం కోసం నామినేషన్‌ బేసిన్‌ మీద తాత్కాలిక షెల్టర్లను నెలకొల్పడానికి చర్యలు తీసుకోబోతున్నా రు. గతేడాదితో పోలిస్తే.. 16శాతం కమర్షియల్‌ అభివృద్ధి చెందగా, 25 నుంచి 30 శాతం మేర వాణిజ్య ఆదాయాన్ని పెంచుకోవడానికి గల అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఈడీ పురుషోత్తం మాట్లాడుతూ, సంస్థ ఆర్థిక స్థితిని మెరు గుపరుచుకునే క్రమంలో వాణిజ్య ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.   

మరిన్ని వార్తలు