ప్రింటింగ్‌ ప్రెస్‌కు ఆర్టీసీ బైబై

14 Feb, 2018 04:57 IST|Sakshi
ఆర్టీసీ ప్రింటింగ్‌ ప్రెస్‌

     ఆర్టీసీ ముద్రణాలయం మూసివేతకు రంగం సిద్ధం 

     ఇప్పటికే నిలిచిన ఉత్పత్తి..

    కొంతకాలంగా చిన్నాచితకా పనులే 

     ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తోంది నలుగురే 

     జూన్‌లో వారి పదవీ విరమణ..ఆ వెంటనే ప్రెస్‌ మూత 

సాక్షి, హైదరాబాద్‌: అది 50 ఏళ్ల చరిత్ర గల ఆర్టీసీ అనుబంధ సంస్థ.. ప్రస్తుతం నలుగురే దాన్ని మోస్తున్నారు.. మరో 4 నెలల్లో వారూ పదవీవిరమణ చేయనున్నారు.. వారి రిటైర్మెంట్‌తో పాటు ఆ సంస్థ కూడా శాశ్వతంగా సెలవు తీసుకోబోతోంది.. అలుపెరగకుండా సేవలందించిన ఆ సంస్థే ఆర్టీసీ ముద్రణాలయం.. ఉత్పత్తి పూర్తిగా నిలిపేసి చిన్నాచితకా పనులకే పరిమితమైన ప్రింటింగ్‌ ప్రెస్‌ను మూసేందుకు రంగం సిద్ధమైంది. యాభై ఏళ్లుగా రవాణా సంస్థతో కలసి సాగుతున్న ఆ ప్రెస్‌తో శాశ్వతంగా బంధాన్ని తెంచుకునేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దాన్ని మోయలేని భారంగా భావి స్తున్న ఆర్టీసీ వదిలించుకుంటోంది. మున్ముందు అవసరమైన ముద్రణ పనులకు ప్రైవేటుపై ఆధారపడేందుకు ఆసక్తి చూపుతోంది. అందులో పని చేసే ఉద్యోగుల జీత భత్యాలు, సంస్థ నిర్వహణ ఖర్చులను సమస్యగా భావిస్తుండటంతో ప్రభుత్వమూ ఆ విషయంలో జోక్యం చేసుకోనంటోంది.  

50 ఏళ్ల క్రితం.. 
రోడ్డు రవాణా సంస్థకు అనుబంధంగా 50 ఏళ్ల క్రితం ముద్రణాలయం ఏర్పడింది. ఆర్టీసీకి అవసరమైన టికెట్లు, పుస్తకాలు, ఎస్‌ఆర్‌ జాబితాలు సహా సంస్థ అవసరాలకు సంబంధించిన అన్ని ప్రతులను ముద్రించేందుకు ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్‌భవన్‌ ఉన్న ప్రాంతంలో ఈ యూనిట్‌ ఉండేది. అప్పట్లో బస్‌బాడీ యూనిట్‌ కూడా ఇక్కడే ఉండేది. 1985లో ప్రస్తుతం ఉన్న చోట్లకు వాటిని తరలించారు. బస్‌బాడీ యూనిట్‌ ను మియాపూర్‌లో ఏర్పాటు చేయటంతో అక్కడే ప్రింటింగ్‌ ప్రెస్‌ నెలకొల్పారు. దానికి 200 మంది కార్మికులను కేటాయించారు. కంప్యూటరీకరణ పెరగడంతో పుస్తకాల ముద్రణ ఆపి సిబ్బంది సంఖ్యను 130కి పరిమితం చేశారు. కొంతకాలంగా ఆర్టీసీ టిమ్స్‌లో వినియోగించే టికెట్‌ రోల్స్‌పై ఆర్టీసీ లోగో ముద్రించే పనే అందులో నిర్వహిస్తున్నారు. పనిలేదన్న కారణంతో సిబ్బందిని ఇతర విభాగా లకు తరలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు పదవీ విరమణ పొందేవరకు ప్రెస్‌ను కొనసాగించి తర్వాత మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ఆర్టీసీకి ముద్రణ అవసరం ఉంటే ప్రైవేటు కంపెనీల్లో చేయించాల్సిందే. 

మూతబడుతున్న యూనిట్లు.. 
తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి సహా జిల్లాల్లోని డిస్పెన్సరీలకు సంబంధించిన ఫార్మసీలను ఇప్పటికే ఆర్టీసీ ప్రైవేటుకు అప్పగించింది. దీని వెనక ఓ రాజకీయ నేత హస్తం ఉందన్న ఆరోపణలు కార్మికుల్లో గుప్పుమంటున్నాయి. తన బంధువుల సంస్థకు ఫార్మసీ బాధ్యతలు అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలొస్తున్నాయి. కార్మికులకు మెరుగైన సేవలందించేందుకు ఫార్మసీ ని ప్రైవేటీకరించినట్లు అధికారులు చెబుతున్నారు.  వరంగల్‌లో ఉన్న ఆర్టీసీ టైర్‌ రీ ట్రేడింగ్‌ యూనిట్‌నూ ఇప్పటికే మూసేశారు. అరిగిపోయిన టైర్లు మరికొంత కాలం మన్నేలా రబ్బర్‌ను ఏర్పాటు చేసి వాటిని తిరిగి సిద్ధం చేయటం ఈ యూనిట్‌ విధి. ఇలాంటి మూడు సంస్థలో ఓ దాన్ని మూసేశారు. మూసే జాబితాలో ఇప్పుడు ప్రింటింగ్‌ ప్రెస్‌ చేరింది.

మరిన్ని వార్తలు