దసరా దంచుడు

10 Oct, 2018 08:08 IST|Sakshi
దసరా సెలవులుబస్సులు, రైళ్లు

మొదలైన దసరా రద్దీ.. కిక్కిరిసిన రైళ్లు, బస్సులు

ప్రైవేట్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీలు

ఆర్టీసీ 50 శాతం అదనపు బాదుడు

రైళ్లలో ‘సువిధ’ పేరిట భారీగా ధరల పెంపు  

సాక్షి,సిటీబ్యూరో: స్కూళ్లు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో మంగళవారం హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ప్రస్తుత రద్దీకి అనుగుణంగా రవాణా సంస్థలు యథావిధిగా అదనపు దోపిడీకి తెరలేపాయి. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను విధిస్తున్నట్లు ఆర్టీసీ ముందే ప్రకటించి.. బాహాటంగానే దోపిడీకి తెరతీయగా.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సైతం ప్రయాణికుల డిమాండ్‌ మేరకు రెట్టింపు చార్జీలతో జేబులు గుల్ల చేస్తున్నాయి. అయితే, ద.మ. రైల్వే మాత్రం ఇప్పటి వరకు అదనపు రైళ్ల ఊసెత్తలేదు. ఉన్న రెగ్యులర్‌ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసాయి. కొన్ని మార్గాల్లో ‘సువిధ’ రైళ్లను మాత్రంవేశారు. ఈ రైళ్లలోనూ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఏటా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసే  అధికారులు.. ఈ ఏడాది ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు కలిసి విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి వంటి నగరాలకు వెళ్లాలంటే ప్రయాణ చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. 

అంతా అ‘ధన’మే..
ఈ ఏడాది దసరా సందర్భంగా సుమారు 4,480 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేపట్టింది. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌Œæనగర్‌ బస్టేషన్లతో పాటు కేపీహెచ్‌బీ, ఈసీఐఎల్, ఎస్‌ఆర్‌నగర్, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు  బయలుదేరతాయి. నగరం నుంచి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, కడప, తిరుపతి, తదితర ప్రాంతాలతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్‌ వంటి తెలంగాణలోని నగరాలకు సైతం ప్రత్యేక బస్సులను నడుపుతారు.  సూపర్‌లగ్జరీ, గరుడ, గరుడ ప్లస్‌ బస్సులతో పాటు కొన్ని ప్రాంతాలకు  డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులన్నింటికీ సాధారణ చార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు. దీంతో సాధారణ రోజుల్లో విజయవాడకు  సూపర్‌లగ్జరీ చార్జీ రూ.304 ఉంటే ప్రత్యేక బస్సుల్లో అది రూ.454 అవుతుంది. సాధారణ రోజుల్లో తిరుపతికి వెళ్లేందుకు గరుడ చార్జీ రూ.888 అయితే ప్రత్యేక బస్సుల్లో రూ.1338 వరకు ఉంది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మరో అడుగు ముందుకేసి సాధారణ చార్జీలపై రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్రతిరోజు సుమారు 500 ప్రైవేట్‌  బస్సులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. ఈ బస్సుల్లో  సాధారణ రోజుల్లో ఉండే చార్జీలకు పండుగ సందర్భంలో విధించే అదనపు చార్జీలకు ఎలాంటి పొంతనా లేదు. సాధారణ రోజుల్లో విశాఖకు ఏసీ బస్సుల్లో రూ.900 చార్జీ ఉంటే దసరా పేరుజెప్పి ఇది రూ.2000 నుంచి ఒక్కోసారి రూ.2500 వరకు కూడా పెరిగిపోతోంది.

సువిధ రైళ్లలోనూ అదనపు దోపిడీ..  
పేద, మధ్యతరగతి వర్గాలకు చౌకగా లభించే రైలు ప్రయాణం కూడా భారంగానే మారుతోంది. స్లీపర్‌ బోగీలను సైతం వదిలిపెట్టకుండా సువిధ రైళ్ల పేరుతో బెర్తుల బేరానికి శ్రీకారం చుట్టింది. ఈ రైళ్లలో చార్జీలు తత్కాల్‌ కంటే రెట్టింపు పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు స్లీపర్‌ క్లాస్‌ చార్జీ రూ.475 అయితే సువిధ రైళ్లలో ఇది రూ.600తో ప్రారంభమై రూ.1200 వరకు కూడా పెరుగుతుంది. విమాన సర్వీసుల తరహాలో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి సువిధ రైలు చార్జీలు పెరుగుతాయి. రిజర్వేషన్‌ టికెట్లు, తత్కాల్‌ బుకింగ్‌లపై ఒకవైపు  దళారులు మోహరించి ప్రయాణికుల జేబులు లూఠీ చేస్తుండగా.. రైల్వే సైతం సువిధ పేరిట అదే బాటలో నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణ తేదీ సమీపిస్తున్న కొద్దీ, బెర్తులు నిండుతున్న కొద్దీ చార్జీలు పెరుగుతాయి. ఉదాహరణకు సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు థర్డ్‌ ఏసీ చార్జీ రూ.1170తో మొదలై క్రమంగా రూ.1400 నుంచి రూ.2000 వరకు చేరుకుంటుంది. అలాగే సెకెండ్‌ ఏసీ చార్జీ రూ.1600తో మొదలై క్రమంగా రూ.2500.. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. సాధారణ రైలు చార్జీలతో పోలిస్తే తత్కాల్‌ చార్జీలే భారం. కానీ తత్కాల్‌  చార్జీలతో ప్రారంభమయ్యే సువిధ చార్జీలు డిమాండ్‌ను బట్టి పెరుగుతూనే ఉంటాయి. 

మరిన్ని వార్తలు